KTR : సిట్టింగ్ ఎమ్మెల్యేకు లాస్ట్ మినిట్‌లో షాక్ ఇచ్చిన బీఆర్ఎస్
ఎన్నికలు సమీపిస్తున్న వేళ పొలిటికల్ ఈక్వేషన్స్ వేగంగా మారుతున్నాయి. టికెట్ కేటాయించినా సీటు దక్కని పరిస్థితి రావడంతో గద్వాల జిల్లా అలంపూర్ పాలిటిక్స్ ఒక్కసారిగా వేడెక్కాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహంకు మొదటి జాబితాలోనే టికెట్ కేటాయించిన బీఆర్ఎస్ అధినాయకత్వం చివరి వరకు కూడా ఆయనకు బీఫామ్ ఇవ్వలేదు. అంతేకాదు…. ఏకంగా అభ్యర్థిని మార్చుచూ… మరో నేతకు బీఫామ్ ఇచ్చింది. దీంతో అలంపూర్ వేదికగా ఆసక్తికర రాజకీయం షురూ అయింది.
అబ్రహం అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ నియోజకవర్గంలో అసమ్మతి జ్వాలలు బలంగా తెరపైకి వచ్చింది. బీఫాంలు అందుకోవాల్సిన తరుణంలో ఇటీవలే నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తరలివెళ్లిన అసంతృప్తి నేతలు అబ్రహంకు వ్యతిరేకంగా కేటీఆర్‌ను కలిసి అభ్యర్థిని మార్చాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో ఈ సీటును విజయుడికి(విజయ్) ఇవ్వాలని కోరారు. అయితే ఈ పేరు తెరపైకి రావటం వెనక ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి ఉన్నారనే చర్చ జోరుగా వినిపించింది. వెంకట్రామిరెడ్డి అనుచరుడిగా విజయుడుకి పేరుంది. ఈ నేపథ్యంలో... బీఆర్ఎస్ అధినాయకత్వం కూడా అభ్యర్థి ఖరారుపై పునరాలోచనలో పడినట్లు తెలిసింది. అబ్రహంనే అభ్యర్థిగా ఖరారు చేస్తే... మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని చల్లా వర్గం తేల్చి చెప్పటంతో… డైలామాలో పడిపోయిన బీఆర్ఎస్ హైకమాండ్… అనుకున్నట్లే అబ్రహంకు షాక్ ఇచ్చింది. ఫైనల్ గా ఎమ్మెల్సీ వర్గం సూచించిన విజయుడికి బీఫామ్ దక్కింది.
బీఫామ్ అందుకునేందుకు అబ్రహం కూడా చివరి వరకు గట్టి ప్రయత్నాలు చేశారు. అయితే బీఫామ్ ఇవ్వకుండా ఆపితే..... పార్టీ మారే విషయంపై కూడా అబ్రహం ఆలోచించారనే వార్తలు గట్టిగా వినిపించాయి. తాజాగా బీఫామ్ దక్కకపోవటంతో ఎమ్మెల్యే రేసు నుంచి అబ్రహం ఔట్ అయినట్లు అయిపోయింది. ఈ నేపథ్యంలో… ఆయన ఈరోజు తన అనుచరులతో సమావేశం నిర్వహించి... కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. అబ్రహం మరో పార్టీలో చేరుతారా? లేక స్వతంత్రంగా బరిలో ఉంటారా అనేది ఆసక్తికరంగా మారింది.