TS Assembly Elections 2023 : రాష్ట్రంలో ఏయే పార్టీలు ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నాయంటే..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో దాదాపు అన్ని స్థానాలకు ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. మొత్తం 119 నియోజకవర్గాలలో పాలక బీఆర్ఎస్ మొత్తం అన్ని స్థానాలకూ అభ్యర్థులను ప్రకటించగా... కాంగ్రెస్ పార్టీ 118 మంది అభ్యర్థులను ప్రకటించింది. మిగతా ఒక స్థానాన్ని తమతో పొత్తు కుదుర్చుకున్న సీపీఐకి కేటాయించింది. ఇక ఈరోజు(శుక్రవారం) తుది జాబితాను విడుదల చేసిన తెలంగాణ బీజేపీ మొత్తం 111 స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దింపింది. మిగిలిన 8 స్థానాలను జనసేన పోటీచేయనుంది.
వీరితో పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ శాఖ 100 సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విబేధాలు రావడంతో ఈ ఎన్నికల్లో సీపీఎం ఒంటరిగా పోటీచేయనుంది. మొత్తం 19 స్థానాలతో ఈసారి ఎన్నికల బరిలోకి దిగుతోంది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఏఐఎంఐఎం ఈ ఎన్నికలలో 9 సీట్లలో పోటీ చేస్తున్నది. మరో ప్రధాన పార్టీ టీడీపీ తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండటంతోపాటు ఏ పార్టీకీ మద్దతు ఇవ్వట్లేదని తెలిపింది. ఇక వైఎస్ షర్మిల నాయకత్వంలోని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ... ఈ అసెంబ్లీ ఎన్నికల బరి నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. కోదండరాం తెలంగాణ జన సమితి (టీజేఎస్) పార్టీ కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా కాంగ్రెస్ కు మద్ధతిస్తోంది.