TS Assembly Elections 2023 : కాంగ్రెస్ మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు..?

Byline :  Krishna
Update: 2023-12-04 07:00 GMT

తెలంగాణ ఎన్నికల్లో పూర్తి మెజార్టీని సాధించడంతో ప్రభుత్వ ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. ఇవాళ సీఎం, డిప్యూటీ సీఎంలు ప్రమాణాస్వీకారం చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఇక మంత్రివర్గంలో ఎవరికి చోటు లభిస్తుందనేది ఆసక్తిగా మారింది. సీఎం అభ్యర్థి కంటే మంత్ర వర్గ కూర్పు కాంగ్రెస్ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉంది. తెలంగాణ కేబినెట్ లో సీఎం కాకుండా 18మందికి అవకాశ ఉంటుంది. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులు కలుపుకుంటే ఆ సంఖ్య 20కు చేరుకుంటుంది. అయితే ఆశావాహుల సంఖ్య ఎక్కువ ఉండడం అధిష్ఠానానికి ఇబ్బందిగా మారే ఛాన్స్ ఉంది.

రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనరసింహా సీఎం రేసులో ఉన్నారు. వీరిలో రేవంత్ రెడ్డి ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ క్రమంలో మిగితావారికి మంత్రివర్గంలో పదవులు గ్యారెంటీ అని చెప్పొచ్చు. ఖమ్మం నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావుకు చోటు దక్కే అవకాశం ఉందని సమాచారం. మహిళ కోటా నుంచి ములుగు ఎమ్మెల్యే సీతక్క, వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖలకు అవకా శం ఉంటుందని కాంగ్రెస్‌ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు అవకాశం దక్కొచ్చని తెలుస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా నుంచి ఎస్సీ కోటాలో వివేక్‌ లేదా వినోద్కు మంత్రిపదవి దక్కే ఛాన్స్ ఉంది. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా నుంచి బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డికి మంత్రి పదవి లేదా స్పీకర్ పోస్ట్ దక్కే అవకాశం ఉంది. మైనార్టీ కోటాలో షబ్బీర్ అలీ, బీసీ కోటాలో హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్‌కు మంత్రివర్గంలో చోటు దక్కుతుందనే చర్చ సాగుతోంది. ఉమ్మడి మహబూబ్ నగర్ నుంచి జూపల్లి కృష్ణారావుకు మంత్రి వర్గంలో చోటు లభించే అవకాశం ఉంది. ఇక జీహెచ్‌ఎంసీ కాంగ్రెస్‌కు తక్కువ సీట్లు వచ్చినా.. సిటీకి ప్రాతినిధ్యం ఉండాలని భావిస్తే.. సీనియర్లకు ఛాన్స్ దక్కే అవకాశం ఉంది.


Tags:    

Similar News