తెలంగాణలో పెరిగిన మహిళా ఓటర్లు

Byline :  Veerendra Prasad
Update: 2023-10-09 08:08 GMT

తెలంగాణ సహ మరో నాలుగు రాష్ట్రలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికల పోలింగ్ జరగనుండగా.. డిసెంబర్ 3న కౌంటింగ్ జరుగనుంది. మిజోరాంలో నవంబర్ 7న , నవంబర్ 17న మధ్యప్రదేశ్, నవంబర్ 23న రాజస్థాన్ రాష్ట్రాల్లో పోలింగ్ జరగనుంది. ఇక ఛత్తీస్ గఢ్లో రెండు విడుతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ నవంబర్ 7, 17న పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న అన్ని రాష్ట్రాల కౌంటింగ్ ఉంటుందని ఈసీ స్పష్టం చేసింది. ఈ ఐదు రాష్ట్రాల్లో మ‌హిళా ఓట‌ర్ల సంఖ్య పెరిగిన‌ట్లు సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు.

తెలంగాణలో 2018 ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌తి వెయ్యి మంది పురుషుల‌కు మ‌హిళా ఓట‌ర్లు 992 మంది ఉంటే, ప్ర‌స్తుతం ఆ సంఖ్య 998కి చేరింది. రాష్ట్రం మొత్తమ్మీద.. 3.17కోట్ల ఓటర్లున్నారు. ఇందులో పురుష ఓటర్లు 1.58 కోట్లు, మహిళా ఓటర్లు 1.58 కోట్లు. తొలిసారి ఓటు హక్కు వచ్చినవారు 8.11లక్షలు (18-19ఏళ్ల వయసు). దివ్యాంగులు 5.06లక్షలు. 80ఏళ్ల వయసు పైబడిన వారు 4.4లక్షలు (వీరికి ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది). వందేళ్ల వయసు దాటిన ఓటర్లు 7005 మంది ఉన్నారు. ఈ సారి కొత్తగా చేరిన ఓటర్ల సంఖ్య 17,01,087గా ఉంది.

ఇక మిగతా రాష్ట్రాల విషయానికొస్తే.. ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో 2018లో 995 మ‌హిళా ఓటర్లు ఉంటే.. ప్ర‌స్తుతం ఆ సంఖ్య 1012కు చేరింది. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో 2018లో 917 ఉంటే, ఇప్పుడు 945కు చేరింది. మిజోరాంలో 2018లో 1051 ఉంటే, ఇప్పుడు ఆ సంఖ్య 1063కు చేరింది. రాజ‌స్థాన్‌లో 914 మంది ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 920కి చేరిన‌ట్లు సీఈసీ పేర్కొన్నారు.




Tags:    

Similar News