Yellow Alert:ఎల్లో అలర్ట్.. రాష్ట్రంలో నేడు, రేపు భారీ వర్షాలు
మొత్తం 24 జిల్లాల్లో భారీ వానలు!!;
రాష్ట్రంలోని పలుచోట్ల రెండ్రోజులపాటు(నేడు, రేపు) భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(Meteorological Department) తెలిపింది. మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. ప్రస్తుతం తుఫాను నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టం నుంచి 3.1నుంచి 5.8 కిలో మీటర్ల ఎత్తు మధ్య కొనసాగుతోందని వివరించింది. గాలులు దిగువ స్థాయిలో పశ్చిమ దిశనుంచి తెలంగాణ మీదుగా వీయడంతో వర్ష ప్రభావం ఎక్కువగా కనిపించే అవకాశాలున్నట్లు తెలిపింది.
ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ కేంద్రం హెచ్చరికలు(Yellow Alert) జారీ చేసింది. ఆ జాబితాలో నిజామాబాద్, ఆదిలాబాద్, యాదాద్రి భువనగిరి, జగిత్యాల, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, ములుగు, భద్రాద్రి-కొత్తగూ డెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, నాగర్‌కర్నూల్, వనపర్తి, ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, వికారాబాద్ జిల్లాలున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం సూచించింది. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ.. ప్రయాణాలు, పనులు చేసుకోవాలని వెల్లడించింది. వాతావరణ శాఖ వర్ష సూచనలతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.