ఏపీలో 48 గంటలు భారీ వర్షాలు..వాతావరణ శాఖ అలర్ట్

Update: 2023-06-23 05:01 GMT

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. దీంతో రాష్ట్రంలో వర్షాలు ఊపందుకున్నాయి. నిన్నమొన్నటి వరకు వేడిగాలులు, ఎండతీవ్రతతో అల్లాడిన ప్రజలు ఇప్పుడు వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. రుతుపవనాలకు తోడు పశ్చిమ మధ్య, వాయువ్య మధ్య బంగాళాఖాతంలో.. ఉత్తరకోస్తా, దక్షిణ ఒడిశాకు ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. సముద్రం నుంచి వచ్చే తేమ గాలుల ప్రభావంతో 48 గంటల పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇప్పటికే నైరుతి రుతుపవనాల ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి.


నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్ మొత్తం విస్తరించాయి. వీటి ప్రభావంతో శుక్రవారం మన్యం, అనకాపల్లి, అల్లూరి , ఉభయగోదావరి జిల్లాలు, కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో తేలికపాటి వానల నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇక మిగిలిన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు నమోదు అయ్యే సూచనలు ఉన్నాయని తెలిపింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. 



 



Tags:    

Similar News