IMD: చల్లని కబురు.. కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు

Update: 2023-06-08 08:12 GMT

నైరుతి రుతుపవనాలపై భారత వాతావరణ విభాగం తీపి కబురు అందించింది. దేశంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్టు ఐఎండీ వెల్లడించింది. రుతుపవనాలు వారం ఆలస్యంగా కేరళ తీరాన్ని గురువారం చేరుకున్నట్లు , దక్షిణ అరేబియా సముద్రంలోని అన్ని ప్రాంతాలకు రుతుపవనాలు వ్యాపించినట్లు ఐఎండీ తన ప్రకటనలో తెలిపింది. సెంట్రల్ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, లక్షద్వీప్ సహా కేరళ, తమిళనాడులోని చాలా వరకు ప్రాంతాలపై రుతుపవనాలు ఆవహించాయని వివరించింది. కొమొరిన్ కేప్; గల్ఫ్ ఆఫ్ మన్నార్​తో పాటు ఆగ్నేయ, మధ్య, ఈశాన్య బంగాళాఖాతానికి గురువారం రుతుపవనాలు వ్యాపించాయని తెలిపింది. మరో వారం రోజుల్లో రాయలసీమ, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు పడనున్నట్లు తెలిపింది.



 సాధారణంగా జూన్ 1న రుతుపవనాలు కేరళను తాకుతుంటాయి. కానీ ఈసారి వారం రోజులు ఆలస్యమైంది. రుతుపవనాలు జూన్ 4న కేరళ తీరాన్ని తాకుతాయని గత నెలలో వాతావరణ శాఖ అంచనా వేసింది. ఐఎండీ అంచనాలకు నాలుగు రోజులు ఆలస్యంగా రుతుపవనాలు రావడం గమనార్హం. మరోవైపు, ప్రైవేటు వాతావరణ సేవల సంస్థ 'స్కైమెట్'.. జూన్ 7న రుతుపవనాలు వస్తాయని ఇదివరకు అంచనా వేసింది. మూడు రోజులు అటూ ఇటూ అవ్వొచ్చని పేర్కొంది. 

Tags:    

Similar News