Ayodhya RamTemple : అయోధ్య గెస్టులకు 7 రకాల ప్రసాదాలు
కొన్ని రోజులుగా అందరూ ఆతృతగా ఎదురు చూసిన అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం ఈ రోజు వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. కాగా ఈ వేడుకలకు శ్రీ రామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర్ దేశంలోని పలువురి ప్రముఖులకు ఆహ్వానాలు పంపగా వారంతా నేడు అయోధ్యకు వచ్చి బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని వీక్షించారు. కాగా అయోధ్యకు వచ్చిన ఆహ్వానితులకు నిర్వాహకులు మొత్తం 7 రకాల ప్రసాదాలు అందజేయనున్నారు. ఈమేరకు ప్రసాదాల పంపిణీ కోసం శ్రీ రామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర్ లక్నోలో 15 వేల స్వీట్ బాక్సులను తయారు చేయించింది. కాషాయ రంగులో ఉన్న ఈ బాక్స్ పై శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర్ లోగోను ముద్రించారు..
7 రకాల ప్రసాదాలు ఇవే..
ఇక ఆహ్వానితులకు అందించే స్వీట్ బాక్సుల్లో మొత్తం ఏడు పదార్థాలు ఉండనున్నాయి. అందులో నేతితో చేసిన రెండు లడ్డూలు, బెల్లం రేవ్డీ, రామదాన చిక్కీ, అక్షతలు, కుంకుమ, తులసీదళం, యాలకులతో పాటు రాముడి దీపం ప్రమిద ఉంటాయి. వాటిని ఓ ప్రత్యేక సంచీలో పెట్టి ఆహ్వానితులకు అందజేయనున్నట్లు ట్రస్ట్ తెలిపింది. కాగా ఈ వంటకాలను గుజరాత్ కు చెందిన భారతి గార్వి గుజరాత్ అండ్ సంత్ సేవాసదన్ ఆధ్వర్యంలో తయారు చేయించారు.