బ్రిజ్ భూషణ్ లాంటివాళ్లు ఇంకా ఉన్నారు.. కాంగ్రెస్ నేత డాలీ శర్మ
ఏఐసీసీ అధికార ప్రతినిధి డాలీ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూపీలో బ్రిజ్ భూషణ్ సింగ్ వంటి వాళ్లు చాలా మంది ఉన్నారని అన్నారు. యూపీలో ప్రతి రెండు గంటలకు ఒక అత్యాచారం జరుగుతోందని, కానీ ఈ నేరగాళ్ల ఇళ్లకు బుల్డోజర్లు మాత్రం వెళ్లడం లేదని అన్నారు. బ్రిజ్ భూషణ్ సింగ్, కుల్దీప్ సింగ్ సెంగార్, చిన్మయానంద్ వంటి వాళ్లపై కేసులు నమోదు చేశారు కానీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. పోలీస్ ఛార్జిషీట్ లో అన్ని విషయాలు ఉన్నాయన్న ఆమె.. పోలీసులు ఏం చేస్తారో ఎదురుచూడాలని ఎద్దేవా చేశారు. బ్రిజ్ భూషణ్ సింగ్ వంటి వ్యక్తులు స్వేచ్ఛగా తిరుతూనే ఉన్నారని అన్నారు. నేరగాళ్లు ఎంపీలుగా గెలిచి పార్లమెంట్ లో కూర్చుంటున్నారని, అలాంటి వాళ్ల వల్ల మొత్తం వ్యవస్థకే చెడ్డపేరు వస్తోందని అన్నారు. చిన్న చిన్న నేరాలకు బుల్డోజర్లను పంపి వాళ్ల ఇళ్ళను నేలమట్టం చేసే బీజేపీ ప్రభుత్వం ఈ నేరగాళ్ల విషయంలో ఎందుకు మౌనంగా ఉంటుందో అర్థం కావడం లేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.