ప్రియురాలి కోసం అమ్మాయి వేషంలో ఎగ్జామ్ సెంటర్ కు.. తర్వాత ఏమైందంటే?
తన ప్రియురాలి కోసం ఓ ప్రియుడి పెద్ద సాహసమే చేశాడు. ఎలాంగైనా తన ప్రేయసిన పరీక్షలో పాస్ చేయించడానికి ఏకంగా తానే ఎగ్జామ్ రాయడానికి పూనుకున్నాడు. ఈ క్రమంలోనే అమ్మాయి గెటప్ లో ఎగ్జామ్ సెంటర్ లోకి ప్రవేశించాడు. తర్వాత ఏం జరిగిందంటే..పంజాబ్ లోని ఫరీద్ కోట్ లో బాబా ఫరీద్ యూనివర్సిటీ జనవరి 7న ఆరోగ్య కార్యకర్తల ఉద్యోగ నియామక పరీక్ష నిర్వహించింది. ఆరోగ్య కార్యకర్త ఉద్యోగం కోసం పరంజీత్ కౌర్ అనే అమ్మాయి కూడా దరఖాస్తు చేసుకుంది. ఆమెకు కోట్కాపుర ప్రాంతంలోని డీఏవీ పబ్లిక్ స్కూల్లో ఎగ్జామ్ సెంటర్ కేటాయించారు. పరంజీత్ కౌర్ కు ఆంగ్రేజ్ సింగ్ అనే ప్రియుడు ఉన్నాడు. ఆంగ్రేజ్ సింగ్ తన ప్రియురాలి కోసం రిస్క్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు.
ఆమెకు ఎలాగైనా ఉద్యోగం రావాలన్న ఉద్దేశంతో, ఆమె తరఫున తాను పరీక్ష రాసేందుకు సిద్ధమయ్యాడు. అచ్చం ప్రియురాలిని తలపించేలా కట్టు బొట్టుతో పరీక్షకు హాజరయ్యాడు. పొడవైన జుట్టు, నుదుటన బొట్టు, లిప్ స్టిక్, చేతికి ఎర్రగాజులు, అమ్మాయిలా దుస్తులు ధరించి పరీక్ష హాల్ కు వెళ్లాడు. అంతా బాగానే ఉంది కానీ, వేలిముద్రల వద్దకు వచ్చేసరికి దొరికిపోయాడు. బయోమెట్రిక్ పరికరంలో అతడి వేలిముద్రలు సరిపోలకపోవడంతో అధికారులకు అనుమానం వచ్చింది. ఆరాతీస్తే అసలు విషయం బయటపడింది. దీంతో విద్యార్థులతోపాటు ఇన్విజిలేటర్లు, అధికారులు నవ్వాపుకోలేక ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అనంతరం పోలీసులకు అతడిపై ఫిర్యాదు చేశారు.