Ayodhya Ram Pratishtha : ఈ రోజు రాముని మరో మందిరం ప్రారంభం.. ఎక్కడో తెలుసా?
దేశంలో ప్రస్తుతం ఎక్కడ చూసినా అయోధ్య రాముడి గురించే చర్చ. ఈ రోజు అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ జరగగా.. ప్రధాని మోడీ,యూపీ సీఎం యోగి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశంలోని పలు ప్రాంతాల నుంచి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. అదేవిధంగా పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. అయితే అయోధ్యలో రామ మందిరం ప్రారంభం అయిన ఈ రోజే ఒడిశా రాష్ట్రం నయాఘర్‌లోని ఫతేగర్ గ్రామంలో మరో రాముడి ఆలయాన్ని ప్రారంభించారు. సముద్రమట్టానికి 1,800 అడుగుల ఎత్తులో కొండపై ఉన్న ఈ ఆలయ ప్రారంభోత్సవం ఇవాళ వైభవంగా జరిగింది. మొత్తం 165 అడుగులో ఎత్తులో ఉన్న ఈ ఆలయ నిర్మాణాన్ని 2017లో ప్రారంభించారు. మొత్తం 150కి పైగా కార్మికులు ఏడేళ్ల పాటు శ్రమించి ఈ ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశారు.
ఆలయంలోని గర్భగుడిలో రాముడి విగ్రహం ఎత్తు 73 అడుగులు ఉండగా.. ఇక ఆలయ నిర్మాణ ఖర్చులను మొత్తాన్ని చందాల ద్వారా సేకరించారు. ఫతేగర్ గ్రామస్తులే సగం నిధులను సమకూర్చుకున్నారు. ఇక మిగతా సగం నిధులను వేరే వ్యక్తులు, భక్తులు, సంస్థల నుంచి సేకరించారు. శ్రీ రామ్ సేవా పరిషత్ కమిటీని ఏర్పాటు చేసుకున్న గ్రామస్తులు కమిటీ ఆధ్వర్యంలో నిర్మాణాన్ని పూర్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారని, రానున్న రోజుల్లో ఈ దేవాలయం ఆధ్యాత్మిక కేంద్రంగా వర్ధిల్లుతుదని గ్రామస్తులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.