Mamata Banerjee : కేంద్రం ఆధార్ కార్డును డీయాక్టివేట్ చేస్తోంది.. బెంగాల్ సీఎం సంచలన ఆరోపణలు
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తమ రాష్ట్రంలోని ప్రజల ఆధార్ కార్డులను బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ‘డీయాక్టివేట్’ చేస్తోందంటూ మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు, వాటికి సంబంధించిన ప్రయోజనాలు ప్రజలకు చేరకుండా చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం బీర్‌భూమ్ జిల్లాలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో మమత మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలపై కేంద్రం వివక్షత చూపుతోందని అన్నారు. కేంద్ర పథకాలు అందకుండా కుట్రలు పన్నుతోందని అన్నారు. ఈ క్రమంలోనే
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డులను డీయాక్టివేట్ చేస్తోందన్నారు. ప్రభుత్వ పథకాలతో డీలింక్ చేయడం వల్ల లబ్దిదారులకు సంక్షేమ ప్రయోజనాలు దూరం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. కానీ తాము ప్రతి ఒక్కరికీ పథకాలకు సంబంధించి ఫలాలను అందిస్తున్నామని, ఆధార్ కార్డు లేకపోయినా లబ్ధిదారులకు చెల్లిస్తున్నామని అన్నారు.
ఆధార్ కార్డు లేకపోవడం వల్ల ఏ ఒక్క లబ్దిదారుడికి పథకాలు ఆగవని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలపై కేంద్రం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని అన్నారు. ఈడీ, సీబీఐ, ఐటీ సంస్థలతో దాడులు చేయిస్తోందని అన్నారు. విపక్ష పార్టీల నేతలను లాక్కోవడం, విపక్ష పార్టీలను లేకుండా చేయడమే లక్ష్యంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తోందని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వ నిజస్వరూపం ప్రజలకు తెలిసిపోయిందని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి పరాభవం తప్పదని దీదీ జోస్యం చెప్పారు.