Instagram Reels భార్యను రీల్స్ చేయొద్దన్నందుకు భర్త ప్రాణాలు తీశారు
బీహార్ లో దారుణం చోటు చేసుకుంది. భార్యను ఇన్‌స్టా రీల్స్ చేయొద్దన్నందుకు భార్య కుటుంబ సభ్యులు భర్తను హత్య చేశారు. ఈ ఘటన ఆదివారం మధ్యరాత్రి జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. బీహార్‌లోని బెగుసరాయ్‌లోని ఫఫౌత్ గ్రామానికి చెందిన మహేశ్వర్ కుమార్ (25)కి ఆరేళ్ల క్రితం రాణికుమారితో వివాహం జరిగింది. వారికి ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. కాగా కుటుంబ పోషణ కోసం మహేశ్వర్ కుమార్ కోల్‌కతాలో కూలీగా పని చేస్తున్నాడు. ఇటీవల తన సొంత గ్రామానికి వచ్చిన మహేశ్వర్ కుమార్.. తన భార్య అస్తమానం ఇన్‌స్టా రీల్స్ చేయడం చూసి మందలించాడు. ఇన్‌స్టా రీల్స్‌ను చేయడం ఆపాలని భార్యపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే భార్యాభర్తల మధ్య పెద్ద గొడవ జరిగింది. దీంతో భార్య తన పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య పోవడంతో కలత చెందిన మహేశ్వర్ కుమార్ అదే రోజు రాత్రి అత్తగారింటికి వెళ్లగా అక్కడ అత్తమామలు అతడితో గొడవపడ్డారు. ఈ క్రమంలోనే మహేశ్వర్ వాళ్లు ఉరి వేసి చంపారని మహేశ్వర్ సోదరుడు రుడాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహేశ్వర్ కు తాను ఫోన్ చేస్తే అత్తమామలు లిఫ్ట్ చేసి ఫోన్ లో ఇష్టమొచ్చినట్లుగా తిట్టారని, వాళ్ల ఇంటికి వెళ్లి చూస్తే తమ సోదరుడు విగతజీవిగా మారాడని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. కాగా మృతుడి భార్యకు ఇన్‌స్టాగ్రామ్‌లో 9,500 మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారని, ఆమె తన హ్యాండిల్‌లో 500 రీల్స్‌కు పైగా పోస్ట్ చేసిందని పోలీసులు తెలిపారు.