Central Election Commission : ఎన్నికల ప్రచారంలోకి పిల్లలను లాగొద్దు.. కేంద్ర ఎన్నికల సంఘం

Byline :  Vijay Kumar
Update: 2024-02-05 11:33 GMT

ఇంకో మూడు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో పిల్లలను లాగొద్దని కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు, ర్యాలీల్లోకి పిల్లలను అనుమతించవద్దని కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరించింది. పోస్టర్లు అంటించడం, స్లోగన్స్ చేయడం, పద్యాలు.. పాటలు పాడించడం, ప్రత్యర్థిపై విమర్శలు చేయడాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు వెల్లడించింది. ప్రచారంలో అభ్యర్థులు తమ పిల్లలను తీసుకురావడం కూడా నిబంధనల ఉల్లంఘనేనని సూచించింది. ఏ రూపంలోనైనా చిన్నారులను ఎన్నికల ప్రచారంలో ఉపయోగించవద్దని రాజకీయ పార్టీలకు స్పష్టం చేసింది. పోస్టర్లు అతికించడం, కరపత్రాల పంపిణీ, నినాదాలు చేయడం సహా ఎందులోనూ పిల్లలను ప్రచారంలో భాగం చేయవద్దని పార్టీలకు విజ్ఞప్తి చేసింది. కొంతమంది నేతలు తమ పిల్లలను, వేరే పిల్లలను ఎన్నికల ప్రచారంలోకి లాగుతున్నారని తమకు సమాచారం వచ్చిందని అన్నారు. ఇక నుంచి అలాంటి ఘటనలు జరిగితే కఠిన చర్యలు ఉంటాయని సీఈసీ హెచ్చరించింది. రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారంలో చిన్నారుల ప్రమేయాన్ని సహించేది లేదని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.

రాజకీయ నాయకులు, పోటీ చేసే అభ్యర్థులు తమ చేతులతో చిన్నారులను ఎత్తుకోవడం, వాహనంలో.. ర్యాలీలో పిల్లలను తీసుకెళ్లడం సహా ఏ పద్ధతిలోనైనా ప్రచార కార్యక్రమాలకు పిల్లలను ఉపయోగించకూడదని సీఈసీ తెలిపింది. పద్యాలు, పాటలు, రాజకీయ పార్టీ, అభ్యర్థి చిహ్నాల ప్రదర్శనలకు కూడా పిల్లలను వినియోగించుకోవద్దని సూచించింది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవడంలో క్రియాశీల పక్షాలు అన్నీ భాగస్వాములు కావాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ కోరారు. తమ ఉత్తర్వులనెవరూ ఉల్లంఘించిన ఈసీ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు. కాగా దివ్యాంగుల పట్ల గౌరవప్రదమైన ప్రసంగాలు చేయాలని కొన్నాళ్ల క్రితం కేంద్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలకు సూచించింది. ప్రస్తుతం అదే తరహాలో చిన్నారుల విషయంలో నిర్ణయం తీసుకుంది సీఈసీ.




Tags:    

Similar News