Pawan Kalyan : రామకార్యం అంటే రాజ్య కార్యం, ప్రజాకార్యం.. పవన్ కల్యాణ్

Byline :  Vijay Kumar
Update: 2024-01-22 10:06 GMT

రామకార్యం అంటే రాజ్యకార్యం, ప్రజాకార్యం అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఈ రోజు అయోధ్యలో జరిగిన బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ఎక్స్ వేదికగా అయోధ్య పర్యటనకు సంబంధించి తన భావాలను పంచుకున్నారు. రాముడు గొప్ప రాజు అని, ఆయన ఏం పని చేసినా ప్రజల కోసమే చేశారని అన్నారు. తండ్రి మాట జవదాటకుండా ఎన్నో ఏళ్లపాటు అరణ్యవాసం చేసిన గొప్ప వ్యక్తి రాముడు అని అన్నారు. ఎన్ని తరాలు గడిచినా రాముడి అందరికీ ఆదర్శమని అన్నారు. అలాంటి రాముడికి 500 ఏళ్ల తర్వాత మళ్లీ దేవాలయం నిర్మించడం, అందులో ఆయనను ప్రతిష్ఠించడం, ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడం గొప్ప అనుభూతిని ఇచ్చిందని అన్నారు.

దీనంతటికీ ప్రధాని మోడీయే కారణమని, ఆయన లేకుంటే రాముడికి గుడి సాధ్యమయ్యేది కాదని అన్నారు. శ్రీ రామచంద్రుడిని స్ఫూర్తిగా తీసుకొని రాజకీయాలు చేస్తామని, అన్ని వర్గాల ప్రజలను ఒకే రీతిన చూస్తూ వాళ్ల అభివృద్ధికి పాటుపడతామని అన్నారు. కాగా ఈ రోజు అయోధ్య రామ మందిరంలో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలో దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో పాటు ప్రధాని మోడీ కూడా పాల్గొన్నారు. 



Tags:    

Similar News