బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ ఛాంపియన్‌షిప్ విజేతగా భారత మహిళల జట్టు నిలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత మహిళా బ్యాడ్మింటన్ టీమ్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ప్రధాని మోడీ భారత మహిళా బ్యాడ్మింటన్ టీమ్ కు శుభాకాంక్షలు తెలిపారు. బ్యాడ్మింటన్ ఆసియా ఛాంపియన్‌షిప్‌లో తొలిసారిగా మహిళల టీమ్ ట్రోఫీని గెలుచుకున్న అద్భుతమైన భారత జట్టుకు అభినందనలు అని ఎక్స్ వేదికగా తెలిపారు. ఇది ఒక చారిత్రక విజయ అని మోడీ అన్నారు. వారి విజయం అనేక మంది రాబోయే క్రీడాకారులను ప్రేరేపిస్తుందని అన్నారు. మన నారీ శక్తి వివిధ క్రీడలలో రాణిస్తున్న తీరు అపూర్వమని మోడీ అభిప్రాయపడ్డారు.
కాగా ఇవాళ మలేషియాలోని సెలంగోర్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో థాయ్‌లాండ్ జట్టును భారత్ 3-2 తేడాతో ఓడించి చరిత్ర సృష్టించింది. క్రీడా చరిత్రలో ప్రతిష్టాత్మకమైన కాంటినెంటల్ టీమ్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను భారత్ గెలుచుకోవడం ఇదే తొలిసారి. భారత బ్యాడ్మింటన్ స్టార్‌లు పీవీ సింధు, గాయత్రి గోపీచంద్-ట్రీసా జాలీ జోడీ, టీనేజ్ సంచలనం అన్మోల్ ఖర్బ్ లు తమ తమ మ్యాచుల్లో గెలుపొందారు. థామస్ కప్‌ను గెలుచుకున్న రెండేళ్ల తరువాత ఖండాంతర టోర్నమెంట్‌లో భారత్ అద్భుతంగా రాణించి చైనా, హాంకాంగ్, జపాన్, చివరికి థాయ్‌లాండ్‌లను ఓడించి కప్పును గెలుచుకుంది.