సీఎం పదవికి నితీశ్ రాజీనామా.. ఆర్జేడీ నేత రియాక్షన్ ఇదే

Byline :  Vijay Kumar
Update: 2024-01-28 11:37 GMT

బీహార్‌ సీఎం పదవికి ఈరోజు నితీశ్‌ కుమార్ రాజీనామా చేశారు. గవర్నర్ కు రాజీనామా లేఖను సమర్పించారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు బీజేపీ సహకారంతో మళ్లీ ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. కాగా బీహార్ నితీశ్ కుమార్ రాజీనామా, అక్కడి తాజా రాజకీయ పరిణామాలపై ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ స్పందించారు. నితీశ్ కుమార్ ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పడే జేడీయూ-బీజేపీ ప్రభుత్వంతో రాష్ట్ర ప్రజలకు ఒరిగేదేమీ లేదని అన్నారు. గతంలో ఆ రెండు పార్టీలు కలిసి రాష్ట్రాన్ని 17 ఏళ్లు పాలించాయని, కానీ ఆ కాలంలో చేయలేని అభివృద్ధిని మహాఘట్ బంధన్ కూటమి హయాంలో చేశామని అన్నారు. దానంతటికీ కారణం తమ పార్టీయేనని అన్నారు. మహాఘట్ బంధన్ కూటమి ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని తమ ఖాతాలో వేసుకుంటే జేడీయూకి వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు.

మహాఘట్ బంధన్ కూటమి ప్రభుత్వంలో ఉన్న తమ పార్టీకి చెందిన మంత్రుల వల్లే ప్రభుత్వానికి మంచి పేరు వచ్చిందే తప్ప జేడీయూ మంత్రుల వల్ల కాదని అన్నారు. 2022 ఆగస్టులో తమ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో నాటి సీఎం నితీశ్ కుమార్ ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదని అన్నారని.. కానీ 2023 ఆగస్టు వరకు దాన్ని సాధ్యం చేసి చూపించామని అన్నారు. విద్య, టూరిజం, ఐటీ, క్రీడా మంత్రిత్వ శాఖలకు తమ పార్టీ నేతలు మంత్రులుగా పని చేశారని, ఈ రంగాల్లో ఎన్నో పాలసీలు తీసుకొచ్చామని అన్నారు. 17 నెలల తమ పాలనలో జరిగిన అభివృద్ధి చరిత్రలో ఏ ప్రభుత్వం చేయలేదని అన్నారు. బీహార్ తాజా రాజకీయ పరిస్థితులను ప్రజలు గమనిస్తున్నారని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు సరైన తీర్పును ఇస్తారని అన్నారు. 

Tags:    

Similar News