కశ్మీర్ రోడ్లపై క్రికెట్ ఆడిన సచిన్.. బీజేపీ రియాక్షన్ ఇదే
ఇండియన్ మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తన కుటుంబంతో కలిసి కశ్మీర్ టూర్ లో ఉన్నారు. ఈ క్రమంలోనే బుధవారం జమ్మూ-కాశ్మీర్‌లోని ఉరీ సెక్టార్ నియంత్రణ రేఖలో చివరి పాయింట్ అయిన అమన్ సేతు వంతెనను సందర్శించారు. అమన్ సేతు సమీపంలోని కమాన్ పోస్ట్ వద్ద మాస్టర్ బ్లాస్టర్ సైనికులతో సంభాషించారు. అనంతరం ఉరిలో స్థానికులతో కలిసి ఆయన క్రికెట్ ఆడారు. ఫైన్-లెగ్ ఏరియా వైపు స్వీప్ షాట్‌తో సహా మరి కొన్ని షాట్స్ ఆడుతూ స్థానికులను ఆనందపరిచారు. అలాగే బ్యాట్‌ను తలకిందులుగా పట్టుకొని షాట్ కొట్టారు. తనను చివరి బంతి వరకైనా అవుట్ చేయాలంటూ బౌలర్ కు సచిన్ సవాల్ విసరగా.. బౌలర్ మాత్రం లిటిల్ మాస్టర్ వికెట్ ను తీయలేకపోయారు. తాజాగా సచిన్ షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కాగా ఈ వీడియోపై తెలంగాణ బీజేపీ ఎక్స్ వేదికగా స్పందించింది. జమ్మూ కాశ్మీర్ లో ఒకప్పుడు శాంతి భద్రతల సమస్య ఉండేదని పేర్కొంది. రోడ్ల మీదకు ప్రజలు రావాలంటేనే భయపడేవారని తెలిపింది. ఇక వీఐపీలు, సెలబ్రిటీల సంగతి గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదని తెలిపింది. బయటకు వస్తే మళ్లీ ఇంటికి వెళ్తమో లేదోననే భయం నాడు ప్రజల్లో ఉండేదని, కానీ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక జమ్మూ-కాశ్మీర్ రూపురేఖలు మారిపోయాయని పేర్కొంది. కాశ్మీర్ వీధుల్లో రాళ్లు రువ్విన రోజుల నుంచి క్రికెట్ ఆడే రోజులు వచ్చాయని తెలిపింది. కాశ్మీర్ లో శాంతి భద్రతలు సాధారణ స్థితికి వచ్చాయనడానికి సచిన్ క్రికెట్ ఆడిన తాజా వీడియో నిదర్శనమని తెలిపింది. కాగా కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ.. జమ్మూ-కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్ 370ని రద్దు చేసిన విషయం తెలిసిందే.