రిపబ్లిక్ డే రోజున చంపేస్తాం .. పంజాబ్ సీఎంకు వార్నింగ్
ఆమ్ ఆద్మీ పార్టీ నేత, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ , అక్కడి డీజీపీ గౌరవ్ యాదవ్ లను చంపేస్తామని ఖలిస్థాన్ ఉగ్రవాది, 'సిక్స్ ఫర్ జస్టిస్' నేత గురుపత్వంత్ సింగ్ పన్నూ బెదిరింపులకు పాల్పడ్డాడు. రిపబ్లిక్ డే (జనవరి 26)న భగవంత్ మాన్ ను చంపేస్తామంటూ హెచ్చరించాడు. గ్యాంగ్‌స్టర్‌లు అంతా ఏకమై రిపబ్లిక్ డే రోజున పంజాబ్ సీఎంను చంపేందుకు కలిసి రావాలని పిలుపునిచ్చాడు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ పంజాబ్‌లో గ్యాంగ్‌స్టర్లపై కఠిన చర్యలు తీసుకోవడమే ఈ బెదిరింపులకు కారణంగా తెలుస్తోంది. ఈ బెదిరింపులపై పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ స్పందించారు. గ్యాంగ్‌స్టర్లపై రాష్ట్ర పోలీసు యంత్రాంగం జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంభిస్తోందని తెలిపారు. పన్నూ బెదిరింపులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
కాగా భారత్ లోని ప్రఖ్యాత ప్రాంతాలపై దాడులు చేస్తామంటూ పన్నూ ఇటీవల తరచూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం భద్రతను కట్టుదిట్టం చేస్తూ వస్తోంది. కాగా సిక్స్ ఫర్ జస్టిస్ వేర్పాటువాద సంస్థను 2019లో భారత్ నిషేధించింది. 2007లో ఈ సంస్థను స్థాపించారు. గురుపత్వంత్ సింగ్ పన్నూ వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్నాడు. ఉపా చట్టం కింద 2020లో అతడినిభారత్ ఉగ్రవాదిగా ప్రకటించింది.