Kishan Reddy : మూడోసారి మోడీయే ప్రధాని.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
దేశానికి మోడీ మూడోసారి ప్రధాని కాబోతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించి కేంద్రంలో మళ్లీ బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయమని అన్నారు. లోక్ సభ 2024 ఎన్నికల నేపథ్యంలో శనివారం బీజేపీ సీనియర్ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలకు ఆయన దిశానిర్దేశం చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు.కేంద్రం చేపట్టిన వికసిత్ భారత్ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని అన్నారు.
ఇంటింటికి బాత్రూమ్ లు కట్టించి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడిన ఘనత కేంద్రంలోని బీజేపీదని అన్నారు. రేషన్ బియ్యం, కరువు పని తదితర కార్యక్రమాలకు కేంద్రం నిధులు ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం వాటి గురించి ప్రజలకు చెప్పడం లేదని అన్నారు. అందుకే ప్రజల కోసం తమ ప్రభుత్వం ఏ ఏ పథకాలను తీసుకొచ్చింది.. ఏ ఏ కార్యక్రమాలు చేపట్టిందనే విషయాలను ప్రజలకు వివరించాలని పార్టీ నేతలు, కార్యకర్తలను కోరారు. రాష్ట్రంలో కనీసం పది ఎంపీ సీట్లు గెలుచుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. దేశంలో బీజేపీని ఓడించే పార్టీయే లేదని, రానున్న ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ సీట్లతో మోడీ మూడోసారి ప్రధానమంత్రి కావడం ఖాయమని అన్నారు.