ముగిసిన ప్రజాపాలన.. ఎన్ని దరఖాస్తులు వచ్చాయంటే?

Byline :  Vijay Kumar
Update: 2024-01-06 14:03 GMT

తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం ముగిసింది. గత నెల 28న ప్రారంభమైన ఈ కార్యక్రమం నేటితో ముగిసింది. అభయహస్తం కింద ఇప్పటివరకు 1,08,94,000 దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. వీటిలో గృహలక్ష్మీ, పింఛన్లు, రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తులకు సంబంధించిన డేటా ఎంట్రీ జనవరి 8వ తేదీ నుంచి 17వ తేదీ వరకు జరగనుంది. కాగా ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ ప్రచారంలోకి వెళ్లింది. ఈ గ్యారెంటీలకు రాష్ట్ర ప్రజలు జేజేలు పలికి కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారు. ఈ క్రమంలోనే ఆరు గ్యారెంటీల్లోని రూ.500కే సిలిండర్, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, రూ.10లక్షల రాజీవ్‌ ఆరోగ్యశ్రీ బీమా, రూ.5లక్షల యువ వికాసం, మహిళలకు నెలకి రూ.2,500 సాయం, రూ.4వేల పింఛన్లు, రేషన్‌ కార్డులు, రైతు భరోసాలాంటి హామీలను అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం లబ్దిదారులను గుర్తించేందుకు ప్రజా పాలన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక ప్రతి నాలుగు నెలలకోసారి ప్రజా పాలన నిర్వహిస్తామని సీఎస్ శాంతి కుమారి తెలిపారు. 

Tags:    

Similar News