బీఆర్ఎస్ కు పెద్ద షాక్ తగిలింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీకి చెందిన 21 మంది కౌన్సిలర్లు బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. ఇప్పటికే 19 మంది కౌన్సిలర్లు తమ రాజీనామా లేఖలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కు పంపించారు. ఇక వైస్ చైర్మన్ సుదర్శన్ రెడ్డి, 14వ వార్డు కౌన్సిలర్ బొర్డు నారాయణ కూడా రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. వాళ్లిద్దరూ కూడా ఇవాళ తమ రాజీనామా లేఖలను కేటీఆర్ కు పంపనున్నట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వ్యవహారం వల్లే కౌన్సిలర్లు కారు పార్టీని వీడేందుకు సిద్ధమయినట్లు సమాచారం. దుర్గం చిన్నయ్య తమను ఏమాత్రం పట్టించుకోవడం లేదని, ఆయనపై పార్టీ అధిష్టానానికి ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని రాజీనామా చేసిన కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన వ్యవహార శైలికి నిరసనగానే తామంతా రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. అయితే బీఆర్ఎస్ కౌన్సిలర్ల రాజీనామాలను కేటీఆర్ ఇంకా ఆమోదించలేదని తెలుస్తోంది. కాగా బెల్లంపల్లి మున్సిపాలిటీలో మొత్తం 34 వార్డులు ఉన్నాయి. ఇటీవలే బీఆర్ఎస్ కు చెందిన 18 మంది కౌన్సిలర్లు బస్సుల్లో శిబిరానికి వెళ్లారు. శుక్రవారం అవిశ్వాస తీర్మానంపై సమావేశం జరగాల్సి ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి 11 మంది సభ్యులు , బీజేపీకి ఒక సభ్యుడు ఉన్నారు. బీఆర్ఎస్ కు 21 మంది మూకుమ్మడిగా రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.