ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ.. దేనికోసమంటే?

Byline :  Vijay Kumar
Update: 2023-12-22 09:56 GMT

పార్లమెంట్ సమావేశాల నుంచి విపక్ష సభ్యులను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు ఇవాళ ధర్నాకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేశారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ఆర్డీవో వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, విప్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై మాట్లాడనీయకుండా కేంద్ర ప్రభుత్వం విపక్ష ఎంపీల గొంతు నొక్కుతోందని మండిపడ్డారు. భారతదేశ పార్లమెంట్ వ్యవస్థలో ఒకేసారి 146 మంది ఎంపీలను సస్పెండ్ చేయడం ఏనాడు జరగలేదని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కుతోందని అన్నారు. పార్లమెంట్ కే రక్షణ కల్పించలేని కేంద్రం.. ఇక సామాన్య ప్రజలకు ఎలా రక్షణ కల్పిస్తుందని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధించి ప్రజా పాలన అందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Tags:    

Similar News