Revanth Reddy : రేపు అసెంబ్లీలో ఇరిగేషన్పై సర్కార్ శ్వేతపత్రం

Byline :  Vijay Kumar
Update: 2024-02-11 14:19 GMT

ఇటీవల రాష్ట్రంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పై అటాక్ చేస్తోంది. ఇప్పటికే గత ప్రభుత్వంలో అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు బీఆర్ఎస్ పై విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే అసెంబ్లీలో రాష్ట్ర విద్యుత్, ఆర్థిక వ్యవస్థపై కాంగ్రెస్ ప్రభుత్వం వేరువేరుగా రెండు శ్వేతపత్రాలు రిలీజ్ చేసింది. తాజాగా రేపు అసెంబ్లీలో ఇరిగేషన్ పై మరో శ్వేత పత్రం రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇవాళ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రజాభవన్ లో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయినట్లు సమాచారం. ప్రాజెక్టులపై రేపు అసెంబ్లీలో చర్చ జరగనున్న నేపథ్యంలో పార్టీ నేతలు, ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ పలు సూచనలు చేశారని తెలుస్తోంది. ప్రాజెక్టులపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని, అవసరమైతే ఇంటికి వెళ్లాక నివేదికను మరోసారి చదుకోవాలని సీఎం దిశానిర్దేశం చేశారని సమాచారం.

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో కూడా ఈ అంశాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని సీఎం పార్టీ నేతలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు సూచించారని తెలుస్తోంది. ఎల్లుండి కాళేశ్వరంలోని మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించనున్న నేపథ్యంలో ప్రాజెక్టులపై పూర్తి అవగాహన తెచ్చుకోవాలని సీఎం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు చెప్పినట్లు తెలుస్తోంది. ఇక కృష్ణా ప్రాజెక్టులు బోర్డుకు అప్పగించడంపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం అందుతోంది. కాగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్వేత పత్రాలకు కౌంటర్ గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 'స్వేద పత్రం' విడుదల చేశారు.




Tags:    

Similar News