Akunuri Murali : లోక్ సభ ఎన్నికల వేళ.. ఆకునూరి మురళి కీలక సూచన

Byline :  Vijay Kumar
Update: 2024-01-08 11:10 GMT

లోక్ సభ ఎన్నికల వేళ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఈవీఎంలకు బదులు పేపర్ బ్యాలెట్ వాడాలని సూచించారు. పేపర్ బ్యాలెట్ కోసం దేశంలోని అనేక పొలిటికల్ పార్టీలు, వ్యక్తులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ప్రపంచంలోనే బాగా అభివృద్ధి చెందిన దేశాలు బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహించుకుంటున్నాయని గుర్తు చేశారు. అమెరికా, నార్వే, కెనడా, జర్మనీ, చైనా, ఫ్రాన్స్, సౌతాఫ్రికా, జపాన్, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, సౌత్ కొరియా, స్వీడన్, స్పెయిన్ వంటి దేశాలు పేపర్ బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు నిర్వహించుకుంటున్నాయని తెలిపారు. ఇక ఇటలీలో ఈవీఎం అలాగే పేపర్ బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు. ఈవీఎంల ద్వారా ఎన్నికల్లో అవకతవకలు జరిగే అవకాశం ఉందని, ఇదే అభిప్రాయాన్ని దేశంలోని పలు పార్టీలు వ్యక్తపరుస్తున్నాయని అన్నారు. గతంలో ఎన్నికల కమిషనర్లు, చీఫ్ ఎన్నికల కమిషనర్ లను త్రి సభ్య కమిటీ సిఫారస్ ల మేరకు కేంద్రం నియమించేదని అన్నారు. కానీ ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్, కమిషనర్ల నియామక బిల్లులో నియామక ప్రక్రియలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఎలాంటి సంబంధం లేకుండా చేశారని అన్నారు. ఇది సరైంది కాదని అన్నారు. ఈ బిల్లు ద్వారా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాజకీయంగా లబ్ది పొందేందుకు ప్రయత్సిస్తోందని ఆరోపించారు.




Tags:    

Similar News