Apoorva Rao : TSRTC జాయింట్ డైరెక్టర్గా అపూర్వరావు బాధ్యతలు స్వీకరణ

Byline :  Vijay Kumar
Update: 2024-02-13 11:02 GMT

TSRTC నూతన జాయింట్ డైరెక్టర్గా ఐపీఎస్ అధికారి అపూర్వరావు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని బస్ భవన్ లో టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సమక్షంలో అపూర్వ రావు బాధ్యతలు చేపట్టారు.సీఐడీ ఎస్పీగా విధులు నిర్వర్తిస్తోన్న అపూర్వరావుని టీఎస్ఆర్టీసీ జాయింట్ డైరెక్టర్ గా ప్రభుత్వం సోమవారం నియమించింది. హైదరాబాద్ చెందిన ఆమె.. 2014 ఐపీఎస్ బ్యాచ్ అధికారి. వనపర్తి, గద్వాల, నల్లగొండ ఎస్పీగా గతంలో పనిచేశారు. టీఎస్ఆర్టీసీకి జాయింట్ డైరెక్టర్ గా ఒక మహిళా ఐపీఎస్ అధికారి నియమితులవడం ఇదే తొలిసారి. ఇక TSRTC నూతన జాయింట్ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన కె.అపూర్వరావుకు సంస్థ ఎండీ వీసీ సజ్జనార్, సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు. సంస్థ అభివృద్ధికి నిబద్ధతతో పనిచేయాలని ఆమెకు సూచించారు.

కాగా ఇటీవల రాష్ట్రంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు వెళ్తోంది. ఈ క్రమంలోనే మహాలక్ష్మి స్కీమ్ లో భాగంగా మహిళకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తున్నారు. ఈ పథకం ద్వారా ఇప్పటికే 16 కోట్ల మంది ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారు. ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమైన హామీ కావడంతో ఉచిత ప్రయాణ హామీని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం టీఎస్ఆర్టీసీని బలోపేతం చేసే పనిలో ఉంది. ఇక ఈ పథకం కోసం ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి కొత్తగా 100 బస్సులను ప్రారంభించారు. 

Tags:    

Similar News