అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.. అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ
ఎన్నికల్లో అబద్ధాలు, మాయమాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ ఆరోపించారు. మంగళవారం నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ఏర్పాటు చేసిన బీజేపీ విజయ్ సంకల్ప యాత్ర బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ అధికారం చేపట్టిందని అన్నారు. ఎన్నికల సమయంలో అధికారంలోకి రాగానే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్న కాంగ్రెస్.. ఆ మాటను నిలబెట్టుకోలేకపోయిందని అన్నారు. అలాగే మహిళలకు నెలకి రూ.2500, వృద్ధులకు రూ.4 వేల పెన్షన్ హామీల ఊసే ఎత్తడం లేదని ఆరోపించారు. ఇక ఏటా జాబ్ క్యాలెండర్ ద్వారా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారని, కానీ ఇంత వరకు కొత్తగా ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని అన్నారు. ఆరు గ్యారెంటీల పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఒక్క గ్యారెంటీను కూడా పూర్తిగా అమలు చేయలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వల్ల పెద్దగా ప్రయోజనం ఏమీలేదని అన్నారు.
ఇక ఆర్థిక సంస్కరణలతో దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లిన మాజీ ప్రధాని పీవీ నర్సింహారావును కాంగ్రెస్ పార్టీ ఘోరంగా అవమానించిందని అన్నారు. కానీ తమ ప్రభుత్వం ఆయన్ను సమున్నతంగా గౌరవించిందని అన్నారు. పార్టీలకతీతంగా ఆయనకు భారతరత్న అవార్డు ప్రకటించామని, ఇది మోడీ లాంటి గొప్ప వ్యక్తులకే సాధ్యమని అన్నారు. 100 కోట్ల హిందువుల ఆకాంక్ష అయిన రామ మందిరాన్ని నిర్మించి మోడీ ప్రజల గుండెల్లో చిరకాల స్థానం సంపాదించుకున్నారని అన్నారు. ఇక కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి రాబోతుందని, మోడీ మూడోసారి ఈ దేశానికి ప్రధాని కాబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. ఇక ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్, బీజేపీఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి, ఈటల రాజేందర్, డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తదితర నేతలు పాల్గొన్నారు.