ఆ జిల్లా ప్రజలకు గుడ్ న్యూస్.. వారానికి 4 రోజులు తిరుపతి ట్రైన్
కరీంనగర్ ప్రజలకు అక్కడి ఎంపీ బండి సంజయ్ గుడ్ న్యూస్ చెప్పారు. ఇక నుంచి వారానికి 4 రోజులు కరీంనగర్-తిరుపతి ట్రైన్ నడవనున్నట్లు ఆయన తెలిపారు. కరీంనగర్ నుంచి తిరుపతి వెంకటేశ్వరస్వామిని దర్శించుకునే భక్తులు కరీంనగర్-తిరుపతికి ట్రైన్ సదుపాయం కేవలం రెండు రోజులు మాత్రమే ఉండటంతో చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ నేపథ్యంలోనే తాను ఈ రోజు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను కలిసి జిల్లాకు సంబంధించిన పలు రైల్వే సమస్యలను వివరించినట్లు తెలిపారు. కరీంనగర్-తిరుపతి ట్రైన్ ను కనీసం వారానికి నాలుగు రోజులైనా నడపాలని కేంద్ర మంత్రిని కోరినట్లు బండి సంజయ్ తెలిపారు. తన వినతికి స్పందించిన రైల్వే మంత్రి.. కరీంనగర్-తిరుపతి రైలును ఇకపై వారానికి 4 రోజులు నడపాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.
మరోవైపు పెద్దపల్లి-నిజామాబాద్ రైల్వే లైన్ లో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేని కారణంగా ఎదురవుతున్న సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లి, అవసరమైన చోట రోడ్ అండర్ బ్రిడ్జ్ (RUB) డ్రైనేజీలను మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించి తక్షణమే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే కరీంనగర్ -హసన్పర్తి కొత్త రైల్వే లైన్ సర్వే పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారని అన్నారు. జమ్మికుంట రైల్వే స్టేషన్ వద్ద తెలంగాణ ఎక్స్ప్రెస్, దానాపూర్ ఎక్స్ప్రెస్, నవ జీవన్ ఎక్స్ప్రెస్, గోరఖ్ పూర్ ఎక్స్ప్రెస్ ట్రైన్లతో పాటు మరిన్ని రైళ్లకు హాల్ట్ కల్పించాలని కేంద్ర మంత్రిని కోరగా..ఈ అంశాన్ని పరిశీలిస్తానని ఆయన హామీ ఇచ్చినట్లు ఎంపీ బండి సంజయ్ తెలిపారు.