ప్రముఖ నటుడు, కాంగ్రెస్ నాయకుడు బండ్ల గణేశ్ మాజీ మంత్రి మల్లారెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై మల్లారెడ్డి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని, బహుశా ఆయనను బర్రె కరిచిందేమో అని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. శనివారం గాంధీభవన్ లో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డిపై మల్లారెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని ఏక వచనంతో సంబోధించడం కరెక్టుకాదని అన్నారు.సీఎం స్థాయిలో ఉన్న ఓ వ్యక్తిని అవమానించేలా మల్లారెడ్డి మాట తీరు ఉందని అన్నారు. తన స్థాయికి తగ్గట్లు మాట్లాడాలని మల్లారెడ్డికి హితవు పలికారు. పిల్లల రక్తంతో స్కూళ్లు, కాలేజీలు కట్టి రాజకీయాన్ని మల్లారెడ్డి కొంటున్నారని అన్నారు. గోవాలో హోటల్ పెట్టుకో.. లేకుంటే క్యాసినో పెట్టుకో.. కానీ రేవంత్ ను ఒక్కమాట అన్నా ఊరుకునేది లేదని మల్లారెడ్డిని హెచ్చరించారు. మల్లారెడ్డి తాత తండ్రిలొచ్చినా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏం చేయలేరని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బాగా పని చేస్తోందని, త్వరలోనే ఇంకో రెండు గ్యారెంటీలు ఇస్తుందని అన్నారు.
ఇక సీఎం రేవంత్ రెడ్డి రోజుకి 24 గంటలు పని చేస్తున్నారని, దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఆయనంతా కష్టపడి పనిచేయడం లేదని అన్నారు. మచ్చలేని అధికారులను నియమించుకొని రాష్ట్రాన్ని పాలిస్తున్నారని అన్నారు. పోలీసుల విషయంలో ఏ రాజకీయ నాయకుడి ప్రమేయం ఉండదని రేవంత్ రెడ్డి ప్రకటించారని అన్నారు. నిజాయితీకి నిలువెత్తు రూపం రేవంత్ రెడ్డి అని, రేవంత్ రెడ్డి పాలనన చూసి ప్రజలు అద్భుతంగా ఉందని మెచ్చుకుంటున్నారని అన్నారు. రేవంత్ ను చూసి రాష్ట్ర ప్రజలు గర్వపడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయిందని, మళ్లీ ఆ పార్టీ అధికారంలోకి వచ్చేది లేదని అన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యనే పోటీ ఉంటుందని అన్నారు. కాగా మల్కాజ్ గిరి పార్లమెంట్ స్థానానికి పోటీ చేసేందుకు బండ్ల గణేశ్ గాంధీభవన్ లో టికెట్ కోసం దరఖాస్తు పెట్టుకున్నారు.