Bhatti Vikramarka : సోనియా మీద ఎవరూ పోటీ పెట్టొద్దు.. భట్టి విక్రమార్క
లోక్ సభ ఎన్నికలకు రాష్ట్రంలోని అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని 17 లోక్ సభ నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టారు పార్టీ నేతలు. ఈ క్రమంలోనే ఆయా నియోజకవర్గాలకు ఇంఛార్జుల నియామకంతో పాటు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటే చేస్తే..ఆమెపై ఏ పార్టీ కూడా తమ అభ్యర్థులను పోటీకి పెట్టవద్దని కోరారు. తెలంగాణ అంటే నిజంగా ప్రేమ ఉన్నవాళ్లు సోనియాను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుక సహకరించాలని అన్నారు. ఎన్నో ఏళ్ల తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం చేసిన గొప్ప వ్యక్తి సోనియా గాంధీ అని, ఆమె లేకుంటే తెలంగాణ వచ్చేదికాదని భట్టి అన్నారు. అలాంటి వ్యక్తి తెలంగాణ నుంచి పోటీ చేయడం రాష్ట్ర ప్రజలకు గర్వకారణమని, ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకొని తెలంగాణ ఇచ్చినందుకు రుణం తీర్చుకోవాలని కోరారు. కాగా ఇటీవల గాంధీభవన్ లో నిర్వహించిన టీపీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగా రానున్న లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి సోనియా గాంధీని పోటీ చేయించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్ని ఆమెకు తెలియజేయగా అందుకు సోనియా ఓకే అన్నట్లు కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. ఆమె ఖమ్మం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.