చెప్పేది కొండంత .. చేసేది గోరంత: మాజీ మంత్రి హరీశ్ రావు
సీఎం రేవంత్ రెడ్డి తీరు చెప్పేది కొండంత ..చేసేది గోరంత అన్నట్లు ఉందని మాజీ మంత్రి హరీశ్ రావు ఎద్దేవా చేశారు. నర్సింగ్ ఆఫీసర్ లకు నియామక పత్రాలు అందజేసిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై హరీశ్ రావు స్పందించారు. ఎల్బీస్టేడియం వేదికగా నర్సింగ్ ఆఫీసర్ లకు నియామక పత్రాల అందజేత పేరిట ఆర్భాటం చేశారని అన్నారు. ఊహించినట్లుగానే తామే రిక్రూట్మెంట్ చేసినట్లు సీఎం డబ్బా కొట్టుకున్నారని అన్నారు. ఎన్నికల ప్రచారం లో కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగులను వంచిందని కల్లి బొల్లి మాటలు చెప్పిన రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో జరిగిన నర్సింగ్ ఆఫీసర్ల భర్తీ ప్రక్రియను తమ ఘనతగా చెప్పుకునే ప్రయత్నం చేస్తూ తన అబద్దాల ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం వచ్చిన 50 రోజుల్లోనే స్టాఫ్ నర్స్ నోటిఫికేషన్ ఇచ్చి, నియామక పత్రాలు ఇచ్చారా అని ప్రశ్నించారు.
తమకు కుళ్ళు లేదు కడుపులో నొప్పి లేదన్న హరీశ్ రావు.. సొమ్మొక్కడిది సోకు ఇంకొకడిది అన్నట్టు ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వడంలో రేవంత్ వ్యవహరించిన తీరు ఉందని అన్నారు. కేసీఆర్ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారమే ఈ నర్సుల నియామక పత్రాలు ఇచ్చిన విషయాన్ని మరచిపోవద్దని, నర్సులుగా ఉద్యోగాలు పొందిన వారికి కూడా వాస్తవాలు తెలుసని అన్నారు. తెల్లారితే గ్రూప్-1 నోటిఫికేషన్ ఇస్తారనుకున్న నిరుద్యోగుల ఆశలపై రేవంత్ రెడ్డి నీళ్ళు చల్లారని, అయన ప్రసంగంలో దీని గురించి ఒక్క మాట లేదని అన్నారు. ఎన్నికల సమయంలో ఫిబ్రవరి 1వ తారీఖున గ్రూప్-1 నోటిఫికేషన్ ఇస్తామని ప్రచారం చేశారని, పత్రికల్లో మొదటి పేజీలో ప్రకటనలు గుప్పించి ఇప్పుడు నోరూమెదపడం లేదని అన్నారు. తాము యదార్థం చెబితే శాపనార్థాలు అని మాట్లాడారే తప్ప నోటిఫికేషన్ల గురించి చెప్పలేదన్న ఆయన.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ నీటిమూటలే అని రేవంత్ రెడ్డి మరోసారి నిరూపించారని అన్నారు.
జాబ్ క్యాలెండర్ కూడా వట్టిదే
రూ.2 లక్షల రుణమాఫీ, రైతు బంధు పెంపు, రూ.500లకు సిలిండర్, 4000 నెలవారీ పింఛన్, మహాలక్ష్మి ద్వారా రూ.2500, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, నిరుద్యోగ భృతి వంటి అమలు కానీ హామీల లిస్ట్ లో నేడు జాబ్ క్యాలెండర్ కూడా చేరిందని ఎద్దేవా చేశారు. అసలు ఉద్యోగాల గురించి, నిరుద్యోగుల బాధల గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్ పార్టీకి ఎక్కడిదని ప్రశ్నించారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ ప్రభుత్వం భర్తీ చేసింది 10 వేల ఉద్యోగాలు మాత్రమే కాదా అని నిలదీశారు. అప్పుడు నిరుద్యోగ యువతను మోసం చేసింది చాలక ఇపుడు మరో సారి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నది ఎవరని ప్రశ్నించారు.
ఉద్యోగ నియామకాల్లో రికార్డు సృష్టించాం
ఉద్యోగ నియామకాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం రికార్డు సృష్టించిందని హరీశ్ రావు అన్నారు. తొమ్మిదిన్నరేళ్లలో లక్షా 65 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని, మరో 40 వేల పోస్టుల భర్తీ ప్రక్రియ వివిధ దశల్లో ఉన్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం మీద ఉద్యోగాల భర్తీకి సంబంధించి రేవంత్ మాట్లాడినదంతా వట్టి డొల్ల అని నేటి కార్యక్రమం రుజువు చేసిందని అన్నారు. 2 లక్షల ఉద్యోగాల భర్తీకి మీరు చేసిన వాగ్దానాన్ని నిలుపుకుంటే స్వాగతిస్తామని, సీఎం హోదాలో తప్పుడు మాటలు చెప్పి నిరుద్యోగులను రెచ్చగొట్టవద్దని అన్నారు. రోజూ అబద్దాలు మాట్లాడే రేవంత్ కు కనీసం కాంగ్రెస్ అధిష్టానం అయినా గడ్డి పెట్టాలని కోరుతున్నానని అన్నారు.