వల వేసి పట్టేది కుందేలును.. పులిని కాదు: రేవంత్ కు వినోద్ కౌంటర్
బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. కేసీఆర్ పులి అయితే ఆయనను వల వేసి బంధిస్తామన్న రేవంత్ కు ఆయన కౌంటర్ ఇచ్చారు. వల వేసి పట్టేది కుందేలును తప్ప పులిని కాదని అన్నారు. పులి వలకు పడదని, దానికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి పడుతారని ఎద్దేవా చేశారు. కరీంనగర్ లో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి, బీజేపీ నేత బండి సంజయ్ కేసీఆర్ పై ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని అన్నారు. రాజ్యాధికారం కోసం తమ నాయకుడు పార్టీ పెట్టలేదని, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేందుకే పార్టీ పెట్టారని అన్నారు. తెలంగాణ సాధించామని, సాధించాక రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లామని అన్నారు.
24 గంటల కరెంట్, కృష్ణా గోదావరి నదీ జలాలతో కోటి ఎకరాలకు సాగునీరు అందించామని అన్నారు. ప్రజా సంక్షేమ కోసం ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చామని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో గెలుపోటములు సర్వసాధారణమని, వాటి గురించి తాము పట్టించుకోమని అన్నారు. అధికారం కోల్పోగానే ఇంట్లో పండుకునే నాయకులం కాదని అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ లాంటి గొప్ప వ్యక్తులు కూడా ఎన్నికల్లో ఓడిపోయారని అన్నారు. తెలంగాణ అభివృద్ధే ధ్యేయంగా బీఆర్ఎస్ పని చేస్తోందని ఆయన స్పష్టం చేశారు.