మాకు ఉన్న నాయకత్వం ఏ పార్టీకి లేదు.. బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్
రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ఉన్న నాయకత్వం ఇంకా ఏ పార్టీకి లేదని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ సీనియర్ నేత బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. సిరిసిల్ల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నంత తెలివైన నాయకులు రాష్ట్రంలో ఏ పార్టీలో లేరని అన్నారు. ఎన్నికల ముందు ఏవేవో హామీలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, అయితే అధికారం వచ్చిందంటే ప్రజలను మర్చిపోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏవేవో చేస్తుందని ప్రజలు ఆశపడ్డారని, కానీ వాళ్లేమీ చేయలేరని ప్రజలకు అర్థమైందని అన్నారు. ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వద్దకు వస్తారని, వారందరి సమస్యలను పరిష్కరించే బాధ్యతను బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు తీసుకోవాలని అన్నారు. తాను కరీంనగర్ ఎంపీగా ఉన్నప్పుడు నియోజకవర్గానికి ఎన్నో అభివృద్ధి పనులు తీసుకొచ్చానని అన్నారు.
కానీ తాను ఎంపీగా ఓడిపోవడంతో పలు పనులు ఆగిపోయాయని, వాటి కోసం తాను కేంద్ర ప్రభుత్వానికి ఎన్నో లేఖలు రాశానని అన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని అన్నారు. కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ నియోజకవర్గానికి చేసిందేమీలేదని అన్నారు. కరీంనగర్ కు రైల్వే లైన్ కేసీఆర్ మానసపుత్రిక అన్న వినోద్ కుమార్.. దాని కోసం కేసీఆర్ యూపీఏ హయాంలోనే లేఖ రాశారని గుర్తు చేశారు. కరీంనగర్ ప్రజల సమస్యలు తీరాలంటే తనలాంటి వ్యక్తిని మళ్లీ పార్లమెంట్ కు పంపాలని, రానున్న ఎన్నికల్లో తనను ఎంపీగా గెలిపించాలని కోరారు. కాగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు.