మంత్రిగా ఉండి ఆటవికంగా ప్రవర్తించారు.. మంత్రి కోమటిరెడ్డిపై జగదీశ్ రెడ్డి ఫైర్

Update: 2024-01-29 14:22 GMT

మంత్రి హోదాలో ఉండి ఆటవికంగా ప్రవర్తించడం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికే చెల్లిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ఎద్దేవా చేశారు. భువనగిరి జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డిపై జరిగిన దాడియే ఆయన ఆటవిక ప్రవర్తనకు నిదర్శనమని పేర్కొన్నారు. భువనగిరి నియోజకవర్గ పరిధిలో జరిగిన అధికారిక పర్యటనలో పాల్గొన్న జడ్పీ చైర్మన్ పై జరిగిన దాడిని జగదీశ్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దాడి జరుగుతున్నప్పుడు రక్షించాల్సిన పోలీసులే జడ్పీ చైర్మన్ హోదాలో ఉన్న సందీప్ రెడ్డిని నెట్టి వేయడం దురదృష్టకరమన్నారు. అత్యుత్సాహం ప్రదర్శించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డీజీపీని డిమాండ్ చేశారు. మంత్రి హోదాలో ఉన్న కోమటిరెడ్డి సత్ప్రవర్తనతో ఉండాల్సింది పోయి ఆటవికంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. అంతటి అహంకారం ఎప్పటికీ ఆరోగ్యకరం కాదని ఆయన హితవు పలికారు. చైతన్యాన్ని పుణికి పుచ్చుకున్న ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు తలకెక్కిన అహంకారాన్ని కిందకు దించుతారని అన్నారు.

నాడు కోమటిరెడ్డి చేసిన దీక్ష తెలంగాణ కోసం ఎంత మాత్రం కానే కాదని ఆయన తేల్చి చెప్పారు. నాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డిని కచ్చితంగా మంత్రి పదవి నుండి తొలగిస్తారని తెలుసుకునే దీక్ష జపం మొదలుపెట్టారని ఆరోపించారు. ఊడిపోయే పదవికి రాజీనామా చేసి తెలంగాణ కోసం రాజీనామా అన్నట్లు నమ్మ పలికే విధంగా త్యాగాల ట్యాగ్ ను పదేళ్ల నుండి మెడకేసుకుని తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. తాజాగా వచ్చిన మంత్రి పదవి కూడా రేవంత్ రెడ్డి కాళ్ళ మీద పడితేనే వచ్చిందని ఆయన పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల గురించి మాట్లాడే నైతికత కోమటిరెడ్డికి లేదన్నారు. 20 ఏండ్లుగా అధికారంలో ఉన్న కోమటిరెడ్డి జిల్లాకు ఒరగపెట్టిందేమీ లేదన్నారు. హామీల అమలుకు ప్రజలు నిలదిస్తుంటేనే అసహనంతో కోమటిరెడ్డి ఆటవికంగా ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు. రైతుబంధు అడిగితే చెప్పులతో కొట్టండి అన్నఆయన.. అధికార పక్షాన్ని నిలదీస్తే తట్టుకోలేక విపక్ష ప్రజాప్రతినిధులను నెట్టండి అంటూ పోలీసులను పురమాయించారని అన్నారు.




Tags:    

Similar News