బీఆర్ఎస్ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌషిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటు కేసులో వచ్చే 6 నెలల్లో సీఎం రేవంత్ రెడ్డికి శిక్ష పడటం ఖాయమని అన్నారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. ఓటుకు నోటు కేసు ట్రయల్ పూర్తయిందని మరో ఆరు నెలల్లో రేవంత్ రెడ్డికి శిక్ష ఖాయమని జోస్యం చెప్పారు. కేసీఆర్ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలను తాము ఇచ్చిన ఉద్యోగాలుగా సీఎం రేవంత్ చెప్పుకుంటున్నారని, ఇది సరికాదన్నారు. అసలు కాంగ్రెస్ ఎప్పుడు అధికారంలోకి వచ్చింది? ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చింది? ఎప్పుడు భర్తీ చేసింది? అని నిలదీశారు. కేసీఆర్‌పై, బీఆర్ఎస్‌పై రేవంత్ రెడ్డి ఇష్టారీతిగా మాట్లాడుతున్నారని... ఇది దురదృష్టకరమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అయిదేళ్లు పూర్తి చేసుకోవాలని బీఆర్‌ఎస్ కోరుకుంటోందన్నారు. కాంగ్రెస్ పార్టీలోనే మంత్రులు, ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డికి రివర్స్ అయ్యే అవకాశముందని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్‌లో ఏక్‌నాథ్ షిండే అయ్యేది రేవంత్ రెడ్డే అని అన్నారు. నిత్యం అబద్దాలు చెప్పడమే పనిగా పెట్టుకున్న వారిని పాథలాజికల్ లయ్యర్ అంటారని, రేవంత్ రెడ్డి అదే కేటగిరీ కిందకు వస్తారన్నారు. హరీశ్ రావుపై కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అధికారం శాశ్వతం కాదని రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు. అధికారంలోకి వచ్చిన 3 నెలలు కూడా కాకముందే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం ఖాయమని అన్నారు. బీఆర్ఎస్ ను ఎందుకు ఓడించామని ప్రజలు బాధపడుతున్నారని, రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ప్రజలు పట్టం కట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.