ఆటోలో వచ్చానని అసెంబ్లీలోకి రానీయలేదు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌషిక్ రెడ్డి

Update: 2024-02-08 11:57 GMT

ఆటోలో వచ్చానని తనను అసెంబ్లీలోపలికి రానీయలేదని, ఆటోలో వస్తే అసెంబ్లీ లోపలికి అనుమతించరా అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌషిక్ రెడ్డి ప్రశ్నించారు. గురువారం అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల 21 మంది ఆటో డ్రైవర్లు చనిపోయారని, ఆటో డ్రైవర్ల పోరాటానికి మద్దతుగా తాను అసెంబ్లీకి ఆటోలో వచ్చానని అన్నారు. కానీ ఆటోను అసెంబ్లీ లోపలకి అనుమతించలేదని అన్నారు. కారులో వస్తేనే అనుమతిస్తారా అని కౌషిక్ రెడ్డి నిలదీశారు. దాదాపు ఆరున్నర లక్షల మంది ఆటో డ్రైవర్లు కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల వల్ల ఉపాధి లేకుండా పోయారని, దీంతో వాళ్ల కుటుంబాలకు రోడ్డున పడ్డాయని అన్నారు. ఈ నేపథ్యంలోనే కుటుంబాన్ని పోషించలేక ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, తాజాగా కరీంనగర్ ప్రాంతానికి చెందిన బుర్రా కరుణాకర్ అనే ఆటో డ్రైవర్ ఇవాళ చనిపోయారని, ఆయన చావు తనను కదిలించిందని అన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది ఆటో డ్రైవర్లు ప్రాణాలు తీసుకుంటున్నారని అన్నారు.

వాళ్ల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వానికి దృష్టికి తీసుకొచ్చేందుకు ఈ రోజు తాను ఆటోలో వచ్చానని అన్నారు. ఆటో డ్రైవర్లెవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదని, వాళ్లకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని, లేకుంటే బీఆర్ఎస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. కాగా ఆటోలో వస్తే చిన్నచూపు ఎందుకు అని ప్రశ్నించారు. ఆటోలో రావడానికి వస్తే పోలీసులు ఆటో డ్రైవర్ పై దాడి చేసి ఆటోను డ్యామేజీ చేశారని అన్నారు. అందుకు నిరసనగా తాను బయటి నుంచి నడుచుకుంటూ అసెంబ్లీలోకి వెళ్లానని అన్నారు. ఇక ఇదే విషయమై స్పీకర్ ను కలిసి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.



Tags:    

Similar News