BRS MLCs : సీఎంపై మండలి చైర్మన్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీల ఫిర్యాదు

Byline :  Vijay Kumar
Update: 2024-01-09 09:57 GMT

సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మల్సీలు శాసన మండలి చైర్మన్ కు ఫిర్యాదు చేశారు. మంగళవారం అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, సురభి వాణిదేవి, ఎంఎస్ ప్రభాకర్ రావు తెలంగాణ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు. ఇటీవల ఓ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి శాసన మండలిని ఇరానీ కేఫ్ గా.. సభ్యులను రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా చిత్రీకరిస్తూ వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో కూర్చుంటే ఇరానీ కేఫ్‌లో కూర్చొని రియల్ ఎస్టేట్ కొనుగోలు, అమ్మకాల ఒప్పందాలు చేసినట్లు ఉందంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారని తెలిపారు. రేవంత్ వ్యాఖ్యలు రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేయబడ్డ అసెంబ్లీని కించపరిచేలా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. రేవంత్ వ్యాఖ్యలు మండలి సభ్యుల మనోభావాలను దెబ్బతీశాయని, ఆయన వ్యాఖ్యలతో సభ్యులు తీవ్ర మానసిక వేదనకు గురయ్యారని తెలిపారు. ఈ విషయంలో చర్యలు తీసుకునేలా తక్షణమే ఈ అంశాన్ని ప్రివిలేజ్ కమిటీకి పంపాలని కోరారు. రేవంత్ రెడ్డిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక తమ ఫిర్యాదులో సీఎం రేవంత్ రెడ్డి టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వూ లింక్ ను లేఖలో పొందుపరిచారు.




Tags:    

Similar News