Bhatti Vikramarka : ప్రజా పాలన హామీల అమలుకు కేబినేట్ సబ్ కమిటీ
ప్రజా పాలన హామీల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆరు గ్యారెంటీల అమలు కోసం కేబినేట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కమిటీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చైర్మన్ గా వ్యవహరించనున్నారు. ఇక కమిటీలో సభ్యులుగా మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు ఉంటారు. హామీలను సమర్థవంతంగా అమలు చేయడంలో ఈ కమిటీ పూర్తి బాధ్యత తీసుకుంటుంది. అర్హుల గుర్తింపు, హామీలను పారదర్శకంగా అమలు చేయడం వంటి పలు విధులను ఈ కమిటీ చేస్తుంది. కాగా రాష్ట్రంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే గత నెల 28 నుంచి ఈ నెల 6 వరకు ప్రజా పాలన పేరుతో అర్హుల నుంచి దరఖాస్తులు సేకరించింది. దరఖాస్తుదారులకు సంబంధించిన వివరాలను పొందుపరిచేందుకు ప్రత్యేక వెబ్ సైట్ ను కూడా తీసుకురానుంది. ఆరు గ్యారెంటీల్లో భాగంగా ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు రూ.2500, రూ.500కే గ్యాస్ సిలిండర్ వంటి పలు పథకాలను 100 రోజుల్లోపు అమలు చేసేందుకు కార్యచరణ చేపట్టింది.