మాజీ మంత్రి నర్సారెడ్డి సేవలు మరువలేనివి.. సీఎం రేవంత్ రెడ్డి
మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నర్సారెడ్డి సేవలు మరువలేనివని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అనారోగ్యంతో మాజీ మంత్రి నర్సారెడ్డి (93) మృతి చెందగా.. సోమవారం హైదరాబాద్ లోని బంజరాహిల్స్ లోని నర్సారెడ్డి నివాసానికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి నర్సారెడ్డి భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. నర్సారెడ్డి ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీ గా ప్రజలకు ఆయన అనేక సేవలందించారని గుర్తుచేశారు. ఉమ్మడి ఏపీలో పీసీసీ అధ్యక్షుడిగా, మంత్రిగా నర్సారెడ్డి చేసిన సేవలు మరువలేనివని అన్నారు. ఆయన అనుభవాలు నేటి తరం నాయకులకు మార్గదర్శకమని సీఎం రేవంత్ తెలిపారు. ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని అన్నారు. పేద ప్రజల అభివృద్ధి కోసం నర్సారెడ్డి నిరంతరం పని చేశారని అన్నారు.
ఆయన పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎందరో యువ నాయకులను పార్టీలోకి తీసుకొచ్చారని అన్నారు. కాగా నిర్మల్‌కు చెందిన మాజీ మంత్రి, మాజీ పీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి ఇవాళ ఉదయం అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఆయన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఎమ్మెల్యే ,ఎంపీ ,ఎమ్మెల్సీ ,పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన నర్సారెడ్డి మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు సంతాపం ప్రకటించారు.