ఫాక్స్ కాన్ చైర్మన్కు సీఎం రేవంత్ అభినందనలు

Byline :  Vijay Kumar
Update: 2024-01-30 15:52 GMT

ఫాక్స్ కాన్ చైర్మన్, సీఈవో యంగ్ ల్యూ ప్రతిష్టాత్మక పద్మ భూషణ్ అవార్డును స్వీకరించటం పట్ల ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యంగ్ ల్యూ కు అభినందనలు తెలియజేస్తూ సీఎం రేవంత్ లేఖ రాశారు. భారత దేశానికి యంగ్ ల్యూ అందిస్తున్న సేవలు విశిష్ఠమైన గుర్తింపు పొందుతున్నాయని ప్రశంసించారు. ప్రపంచంలో సెమీ కండక్టర్ టెక్నాలజీ విప్లవంలో అత్యంత కీలకమైన భాగస్వామ్యం అందించిన ప్రత్యేకతను యంగ్ ల్యూ చాటుకున్నారని అభినందించారు. ఎప్పటికప్పుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవటంలో తెలంగాణ ముందు వరుసలో ఉందని పేర్కొన్నారు.

ఈ కృషిలో ఫాక్స్ కాన్ భాగస్వామి కావటం తమకు ఆనంద దాయకమని అన్నారు. భారతదేశానికి వచ్చినప్పడు హైదరాబాద్ నగరానికి యంగ్ ల్యూని సాదరంగా ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. కాగా తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవిలకు పద్మ విభూషణ్ అవార్డులు ప్రకటించిన కేంద్రం.. యక్షగాన కళాకరుడు గడ్డం సమయ్య, స్థపతి డాక్టర్ ఆనందచారి వేలు, బుర్ర వీణ వాయిద్యకారుడు దాసరి కొండప్ప, హరికథా కళాకారిణి ఉమామహేశ్వరి, కేతావత్ సోమ్ లాల్, కూరెళ్ల విఠలాచార్య కు పద్మశ్రీ ప్రకటించింది.

Tags:    

Similar News