CM Revanth Reddy : మూసీ నది అభివృద్ధిపై సీఎం రేవంత్ సమీక్ష

Byline :  Vijay Kumar
Update: 2024-01-02 15:37 GMT

మూసీ నది అభివృద్ధి పై నానక్ రామ్ గూడ హెచ్ఎమ్డీఏ కార్యాలయంలో అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మునిసిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్, జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ ఆమ్రపాలి, సీఎం ఓఎస్డీ అజిత్ రెడ్డి, ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. మూసీ నది అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. హైదరాబాద్‌ మహానగరంలో మూసీ నది ప్రారంభమయ్యే ప్రాంతం నుంచి చివరి వరకు మూసీ నది పరివాహక ప్రాంతం మొత్తాన్ని ఉపాధి, ఆర్థికాభివృద్ధి ప్రాంతంగా రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

పర్యాటకులను ఆకర్షించే విధంగా తీర్చిదిద్దాలన్నారు. మూసీ నది వెంట బ్రిడ్జిలు, కమర్షియల్‌, షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, అమ్యూజ్‌మెంట్‌ పార్కులు, వాకర్‌ జోన్‌లు, పాత్‌-వేలను ప్రభుత్వ, ప్రైవేట్‌ పార్ట్‌నర్‌షిప్‌ విధానంలో నిర్మించే విధంగా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలన్నారు. మూసీ నదిలో కాలుష్యాన్ని తగ్గించి, మురుగు నీరు ప్రవహించకుండా అవసరమైన ప్రాంతాల్లో మురుగునీటి శుద్ధి ప్లాంట్లను ఏర్పాటు చేయాలన్నారు. మూసీలో శుద్ధి చేసిన నీరు ప్రవహించేందుకు చర్యలు చేపట్టడంతో పాటు.. తగు నీటిమట్టం ఉండేలా చెక్‌ డ్యామ్‌లు నిర్మించాలని అధికారులను ఆదేశించారు.

Tags:    

Similar News