ప్రైవేట్ యూనివర్సిటీల్లో రిజర్వేషన్లు తీసుకొస్తాం.. సీఎం రేవంత్ రెడ్డి

Update: 2023-12-30 15:47 GMT

రాష్ట్రంలోని ప్రైవేట్ యూనివర్సిటీల్లోనూ రిజర్వేషన్లు తీసుకొస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాజ్యాంగబద్ధంగా ఉండాల్సిన ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు అమలుచేయకుండా ప్రైవేటు యూనివర్సిటీలు ఇష్ఠారాజ్యంగా నడిపించుకోవడం సరికాదని సీఎం అన్నారు. శనివారం విద్యాశాఖ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రైవేటు యూనివర్సిటీల మార్గదర్శకాలపై సమగ్రంగా విచారణ చేయాలని అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించాలనేది రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని, రాష్ట్రంలోని ప్రైవేటు యూనివర్సిటీలలోనూ రిజర్వేషన్లు అమలుచేయడానికి అవసరమైతే అసెంబ్లీలో చట్టం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీలకు అనుమతులు, మార్గదర్శకాలు, ప్రభుత్వం నుంచి పొందుతున్న సౌకర్యాలు, విద్యార్థుల సంఖ్య, వసూలు చేసిన ఫీజులు, ఫీజు రీయింబర్సుమెంటు, టీచింగ్ సిబ్బంది, నాన్ టీచింగ్ సిబ్బంది వంటి వాటి అన్నింటిపైనా నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మౌలికవసతులు, అర్హతలున్న సిబ్బంది లేకుండా ప్రమాణాలతో కూడిన విద్యను ప్రైవేటు యూనివర్సిటీలు ఎలా అందిస్తున్నాయో నివేదికను ఇవ్వాలన్నారు.

ఇండ్ల ప్లాట్లకు రిజిష్ట్రేషను అయిన భూములను, ధరణిలో చూపించిన ప్రైవేటు యూనివర్సిటీకి అనుమతిని ఇచ్చారని, అలాంటివాటిలో ఎలాంటి విద్యను అందిస్తున్నాయనే నివేదికను ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఇండ్ల స్థలాల కింద రిజిష్టరు అయిన వివాదంలో ఉన్న భూముల్లో యూనివర్సిటీలకు అనుమతులు ఇవ్వడం వల్ల ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వీటిపై సమగ్ర నివేదికను ఇవ్వాలని ఆదేశించారు. యూనివర్సిటీకి అనుమతులు రాకుండానే అడ్మిషన్లు నిర్వహించిన ఒక కాలేజీ వ్యవహారం వల్ల గత విద్యాసంవత్సరంలో చాలామంది విద్యార్థులు ఇబ్బందులు పడిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు.

సర్వ శిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) నిధులతో మన ఊరు-మన బడి కింద ఖర్చు చేసిన నిధులకు సంబధించి సమగ్రంగా విచారణ జరపాలని సీఎం ఆదేశించారు. మన ఊరు-మన బడి కార్యక్రమం కింద ఇప్పటిదాకా జరిగిన నిధుల వినియోగంపైనా సమగ్రంగా విచారణ జరిపి నివేదికను ఇవ్వాలని సీఎం ఆదేశించారు.


Tags:    

Similar News