Revanth Reddy : మేడారం జాతరకు రావాలంటూ సీఎం రేవంత్కు ఆహ్వానం
ములుగు జిల్లాలో వచ్చే నెలలో జరగనున్న మేడారం జాతరకు రావాలని రావాలని సీఎం రేవంత్‌రెడ్డికి ఆలయ పూజారుల సంఘం ఆహ్వానపత్రికను అందజేసింది. శనివారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయానికి వచ్చిన మేడారం పూజారులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి సమ్మక్క, సారక్క జాతరకు రావాలని కోరారు. ఈ సందర్భంగా జాతరకు సంబంధించిన పోస్టర్లను సీఎం ఆవిష్కరించారు. ఫిబ్రవరి 23న మేడారం జాతరకు తాను వస్తానని సీఎం వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు మంత్రలు సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ మంత్రులు, అధికారులను ఆదేశించారు. మేడారం పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని అన్నారు.
కాగా తెలంగాణ కుంభమేళగా పేరుగాంచిన మేడారం జాతర ఫిబ్రవరి 21వ తేదీన ప్రారంభమై ఫిబ్రవరి 24న ముగియనుంది. ఇక ఫిబ్రవరి 21వ తేదీన సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజును గద్దెకు తీసుకువస్తారు. ఫిబ్రవరి 22వ తేదీన సమ్మక్క దేవత గద్దెకు చేరుకుంటుంది. ఫిబ్రవరి 23వ తేదీన భక్తులు మొక్కులు తీర్చుకుంటారు. ఫిబ్రవరి 24వ తేదీన తిరిగి సమ్మక్క, సారక్కలు వనప్రవేశం చేస్తారు. ఫిబ్రవరి 28న జాతరకు సంబంధించిన ముగింపు కార్యక్రమాలు ఉంటాయి.