కలుస్తానంటే కేసీఆర్కు కూడా అపాయింట్మెంట్ ఇస్తా.. సీఎం రేవంత్
తనను కలుస్తానంటే కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులకు కూడా అపాయింట్ మెంట్ ఇస్తానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం గాంధీ భవన్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. నియోజకవర్గ సమస్యలు చెప్పుకోవడానికి ప్రతి ఒక్క ఎమ్మెల్యే తనను కలవొచ్చని అన్నారు. ఈ పార్టీ ఆ పార్టీ అని తేడా ఏమీలేదని, ఎవరైనా తనను కలవొచ్చని అన్నారు. ఈ క్రమంలోనే ప్రజల సమస్యలు చెప్పుకోవడానికి మాజీ సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులు కూడా తనను కలవొచ్చని అన్నారు. ఒకవేళ తాను అందుబాటులో లేకుంటే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలవొచ్చని అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ చచ్చిపోయిందని సీఎం అన్నారు. దేశానికి బీజేపీ ప్రమాదకరంగా మారిందని, మోడీ 100 లక్షల కోట్ల రూపాయల అప్పు చేశారని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ కలిసి పని చేయబోతున్నాయని అన్నారు. వీరి కుట్రలను తిప్పికొట్టాలని రాష్ట్ర ప్రజలను సీఎం కోరారు. ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని అన్నారు. తెలంగాణలో సోనియా గాంధీని పోటీ చేయించాలని పీఏసీలో తీర్మానం చేశామని, ఆమెను గెలిపించి రాష్ట్రం ఇచ్చినందుకు రుణం తీర్చుకోవాలని కోరారు.