త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం కూలిపోనుందంటూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ మండిపడ్డారు. ఈ క్రమంలోనే ఆయన ఇవాళ విజయసాయి రెడ్డికి కౌంటర్ ఇచ్చారు. విజయసాయి రెడ్డి పెద్ద అజ్ఞాని అని అన్నారు. రోజుకొకరు చొప్పున తమ ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కుతున్నారని, అదే పార్లమెంట్ సాక్షిగా విజయసాయి రెడ్డి మాటల్లో కనబడిందని అన్నారు. కేసీఆర్ తో అంటకాగుతున్న వైసీపీకి చెందిన విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు దేనికి సంకేతమో చెప్పాలని డిమాండ్ చేశారు. మోడీ దగ్గర మార్కులు పొందడానికి ఆయన తమపై ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడారని అన్నారు. ఈ వ్యాఖ్యల ద్వారా విజయసాయి రెడ్డికి ఎంత తెలివి ఉందో అర్థమవుతోందని సైటైర్లు వేశారు. ఏపీలో షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ బలోపేతం కావడం వైసీపీ నేతలకు నచ్చడం లేదని అన్నారు. కానీ రానున్న ఎన్నికల్లో వైసీపీకి కాంగ్రెస్ తగిన విధంగా బుద్ధి చెబుతుందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వంపై కామెంట్ చేయడం ప్రతి ఒక్కరికి పరిపాటి అయిపోయిందని అన్నారు. జగన్ ప్రభుత్వంపై తాము కూడా కామెంట్ చేయగలమని, కానీ తమకు ఆ అవసరం లేదని అన్నారు. రాష్ట్రం విడిపోకపోతే జగన్ ముఖ్యమంత్రి అయ్యేవారా అని ప్రశ్నించారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏపీకి సమస్యలు రాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూసుకుంటారని అన్నారు.