అధికారంలోకి వచ్చి రెండు నెలలు కూడా కాకముందే బీఆర్ఎస్ నేతలు తమ ప్రభుత్వంపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారని, వారి కుట్రలను తిప్పికొడతామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. బుధవారం గాంధీభవన్ లో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో సీఎం, మంత్రులు ఏనాడు కూడా సెక్రటేరియట్ లో కూర్చోలేదని అన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావుతో పాటు ఇతర బీఆర్ఎస్ మంత్రులు తమ ఇళ్లనుంచే పాలన చేశారని అన్నారు. కానీ తమ ప్రభుత్వంలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టితో పాటు ఇతర మంత్రులు సెక్రటేరియట్ నుంచే తమ విధులను నిర్వహిస్తున్నారని అన్నారు. మొదటి నెలలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని, అలాగే ఆరోగ్యశ్రీని రూ.10 లక్షలకు పెంచామని అన్నారు. రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ హామీలను త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆరు నెలలు ఆగితే కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని ఓ వైపు కేటీఆర్.. త్వరలోనే కేసీఆర్ అవుతారని హరీశ్ రావు చెబుతున్నారని అన్నారు. భయంతోనే వాళ్లు ఈ వ్యాఖ్యలు చేశారని అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వెళ్తారనే భయంతోనే వాళ్లు కామెంట్ చేస్తున్నారని అన్నారు.
ఇక ఏపీకి చెందిన విజయసాయి రెడ్డి కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి వకాల్తా పుచ్చుకున్నారా అని విజయసాయి రెడ్డిని ప్రశ్నించారు. ఆత్మగౌరవం లేని వ్యక్తి అని అన్నారు. ఏపీ సీఎం జగన్, కేసీఆర్ ఒక్కటేనని, వాళ్లిద్దరూ ప్రధాని మోడీకి తొత్తులు అని మండిపడ్డారు. ఏపీ సీఎం జగన్ కు తన తండ్రి వైఎస్ఆర్ కు ఉన్నంత పౌరుషం లేదని, అందుకే ఆయన కేసీఆర్, మోడీకి తొత్తుగా మారారని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ, వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణలో ఐదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందని అన్నారు. దీంట్లో ఎలాంటి అనుమానం లేదని అన్నారు. పై మూడు పార్టీల రాజకీయ ఎత్తుగడలను తిప్పి కొడతామని అన్నారు. తమకంటూ ఓ వ్యూహం ఉందని, తాము తలుచుకుంటే బీఆర్ఎస్ నుంచి 20 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తారని అన్నారు. ఆ పార్టీలో ఎమ్మెల్యేలకు స్వేచ్ఛలేదని, అందుకే వాళ్లు కాంగ్రెస్ లోకి రావాలని కోరుకుంటున్నారని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తమ ప్రభుత్వం నెరవేరుస్తుందని అన్నారు.