కాళేశ్వరం దోపిడీ బిల్లులు కేసీఆర్ ఇంటికి పంపాలి.. కాంగ్రెస్ నేత Vijayashanthi
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు విజయశాంతి మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ప్రజలెవరూ కరెంట్ బిల్లులు కట్టవద్దని.. ఆ బిల్లులను సోనియాగాంధీకి పంపించాలన్న కేటీఆర్ వ్యాఖ్యలకు ఆమె కౌంటర్ ఇచ్చారు. కరెంట్ బిల్లులను పంపించడం కాదు.. కాళేశ్వరం దోపిడీ బిల్లులను కేసీఆర్ ఇంటికి పంపించాలని అన్నారు. తొమ్మిదిన్నర పాలనలో రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చిందని అన్నారు. తమ హయాంలో రాష్ట్రం అప్పుల పాలైన విషయం కేటీఆర్ కు తెలుసు కాబట్టే అలా మాట్లాడుతున్నారని అన్నారు.
ఖజానా మొత్తం దోచుకొని హామీలను ఎలా అమలు చేస్తారని అడగటం సిగ్గుచేటని అన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడి కనీసం రెండు నెలలు కూడా గడవక ముందే బీఆర్ఎస్ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని తమ సీఎం ప్రజలకు మాట ఇచ్చారని, ఇచ్చిన మాట ప్రకారం ఎన్ని కష్టాలొచ్చినా 5 గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడే పార్టీ కాంగ్రెస్ అని, అందుకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే ఉదాహరణ అని అన్నారు.