ఆ తేదీ తర్వాత పెళ్లైన వాళ్లకే కల్యాణలక్ష్మి.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 2023 డిసెంబర్ 7 తర్వాత పెళ్లి చేసుకున్నవాళ్లకే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన కల్యాణ లక్ష్మి హామీని అమలు చేస్తామని అన్నారు. ఆ తేదీ తర్వాత పెళ్లి చేసుకున్నవాళ్లకు మాత్రమే తమ మేనిఫెస్టోలో చెప్పినట్లుగా రూ.లక్ష, తులం బంగారం ఇస్తామని అన్నారు. అలాగే షాదీముబారక్ ద్వారా ముస్లిం వధువు కుటుంబానికి లక్షా 60 వేల రూపాయలు ప్రభుత్వం తరఫున ఇస్తామని అన్నారు. ఇక అంతకు ముందు పెళ్లైన వాళ్లకు పాత పద్ధతిలోనే కల్యాణలక్ష్మి పథకాన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు. కల్యాణలక్ష్మి అమలుపై ఎలాంటి సందేహాలు అవసరం లేదని, వంద శాతం తమ ప్రభుత్వం కల్యాణలక్ష్మి పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేస్తుందని అన్నారు. ఇక రూ.5 లక్షల విద్యానిధి పథకాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తామని తెలిపారు. అందుకు కావాల్సిన కార్యచరణను రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. కాగా ఇటీవల రాష్ట్రంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఎన్నికల మేనిఫెస్టోలోని 6 గ్యారెంటీల్లో భాగంగా ఇప్పటికే ఆరోగ్యశ్రీ రూ.10 లక్షలకు పెంపు, టీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీలను అమలు చేస్తోంది. 100 రోజుల్లో 6 గ్యారెంటీలను అమలు చేసి తీరుతామని ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి ప్రకటించారు.