Etala Rajender : కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేరిస్తే రాజకీయాల నుండి తప్పకుంటా.. ఈటెల రాజేందర్
మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేస్తే తాను రాజకీయాల్లో నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని అన్నారు. మాజీ ఎంపీ బూరనర్సయ్య గౌడ్ తో కలిసి ఈటల రాజేందర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. రూ.2 వేల పెన్షన్ ఇవ్వడానికే కేసీఆర్ చాలా ఇబ్బందులు పడిందని, ఒక్కోసారి రెండు నెలల పెన్షన్ ఒకేసారి ఇచ్చేవారని అన్నారు. అలాంటిది సీఎం రేవంత్ రెడ్డి వృద్ధులు, వితంతువులకు నెలకి రూ.4 వేల పెన్షన్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. దివ్యాంగులకు రూ.6 వేల పెన్షన్ ఇవ్వడం సాధ్యమవుతుందా అని అన్నారు. రూ.500కే గ్యాస్ సిలిండర్, 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకి రూ.2500 ఆర్థిక సాయం ఎలా అమలు చేస్తారని నిలదీశారు. అలాగే డ్వాక్రా గ్రూపుల్లోని మహిళలకు వడ్డీ లేకుండా రూ.10 లక్షల లోన్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో చెప్పిందని, మరి ఈ హామీ అమలవుతుందా అని అడిగారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ మాత్రం అమలు చేస్తున్నారని, కానీ రద్దీ దృష్ట్యా కొత్త బస్సులు మాత్రం కొనడం లేదని అన్నారు.
డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తామని చెప్పారని, కానీ దీని గురించి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని అన్నారు. అలాగే పేదల సంబంధించిన 25 లక్షల అసైన్ మెంట్ భూములను తిరిగి పేదలకే పంచి ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పిందన్న ఈటల.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై స్పందించడం లేదని అన్నారు. ధరణి రద్దు చేస్తామని చెప్పారని, అక్రమంగా భూములు లాక్కున్న వారి నుంచి తిరిగి ఆ భూమిని ప్రభుత్వం పరం చేస్తామని చెప్పారని అన్నారు. కానీ ఈ విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేదని మండిపడ్డారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలవడం ఖాయమని, మోడీ మూడోసారి దేశానికి ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు. కాగా ఇటీవల తెలంగాణలో అధికారంలోకి వచ్చి కాంగ్రెస్.. ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పింది. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, నెలకి రూ.2500, ఇందిరమ్మ ఇండ్లు, ఆరోగ్యశ్రీకి రూ.10 లక్షలు పెంపు, రైతు భరోసా వంటి పలు హామీలు ఇచ్చారు. ఆరు గ్యారెంటీలను 100 రోజుల్లోనే అమలు చేస్తామన్న కాంగ్రెస్.. ప్రస్తుతం రెండు హామీలను అమలు చేస్తుండగా.. మరో రెండు గ్యారెంటీలను ఈ నెలాఖరులో అమలు చేసేందుకు సిద్ధమైంది.