డీఎస్పీ నళిని గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదు. తెలంగాణ ఉద్యమ సమయంలో నళిని పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. "నా అన్నాచెల్లెళ్లపై లాఠీ ఝుళిపించలేను" అంటూ తన డీఎస్పీ ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలేసుకున్నారు నళిని. ఆమె తీసుకున్న ఈ నిర్ణయం తెలంగాణ పోరాటంలో ఎంతోమందిని ఉత్తేజపరిచింది. యువతలో ఓ పోరాట స్ఫూర్తిని రగిలించింది. ఇక ఉద్యోగాన్ని వదిలేసిన కొంతకాలానికి నళిని ఆధ్యాత్మిక రంగంలోకి అడుగుపెట్టి దేవుడికి అంకితం అయింది. అయితే తెలంగాణ వచ్చాక ఆమెకు తగినంత గుర్తింపు రాలేదని ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే ఇటీవల రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగా.. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక నళిని త్యాగాన్ని మీడియా ముఖంగా ప్రస్తుతించారు. దీంతో నళిని మరోసారి వార్తల్లోకెక్కారు. ఈ నేపథ్యంలోనే ఆమె సీఎం రేవంత్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు ప్రభుత్వం ఆమెకు డీఎస్పీ స్థాయి ఉద్యోగాన్ని ఆఫర్ చేస్తే నళిని సున్నితంగా తిరస్కరించారు. తాను ఇప్పుడు ఆధ్యాత్మికంగా చాలా ప్రశాంత జీవితాన్ని గడుపుతున్నానని, ఉద్యోగంలాంటివి ఏమీ వద్దని సీఎంతో చెప్పారు.
అయితే ఇదంతా అందరికి తెలిసిందే. అసలు విషయానికొస్తే.. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న మాజీ డీఎస్పీ నళిని.. ఫేస్‌బుక్‌లో అందుకు సంబంధించిన పోస్టులు పెడుతూ యాక్టివ్‌గా ఉంటారు. తాజాగా ఫేస్ బుక్‌లో ఆమె ఓ ఆసక్తికర పోస్ట్ చేశారు. "నేను ఉద్యమం చేసినప్పుడు ఫేస్‌బుక్‌ను ఇప్పటిలా వాడి ఉంటే.. నా సామిరంగా కథ ఇంకో రకంగా ఉండి ఉండేది" అంటూ ఆసక్తికర పోస్ట్ చేశారు. దీంతో ఆమె పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.